చెట్లు నరికిన వారిపై కేసు.. జరిమానా

చెట్లు నరికిన వారిపై కేసు.. జరిమానా

చెట్లు నరికిన వారిపై కేసు.. జరిమానా

జీడిమెట్ల, వెలుగు : తొమ్మిది చెట్ల నరికివేతకు అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో అదనంగా చెట్లను నరికేసిన వ్యక్తులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ శాఖ అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్​లోని  గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ రోడ్ కె.వి.రెడ్డి నగర్​లో నదీమ్ పాషా, అజయ్ దేవ్, బాలాజీ అనే వ్యక్తులు ఈనెల 21, 24 తేదీల్లో 32 చెట్లను నరికేశారు.

ఈ విషయమై అక్కడి ‘అంతెం’ సంక్షేమ సంఘం సభ్యులు వారిని ప్రశ్నించగా.. చెట్లను నరికేందుకు పర్మిషన్ ఉందంటూ పేపర్లు చూపించారు. వారు పరిశీలించగా నదీమ్ ఐదు చెట్లు, అజయ్ దేవ్ నాలుగు చెట్లు నరికేందుకు రెసిడెన్షియల్ అడ్రెస్​తో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ నుంచి అనుమతులు పొందినట్లు తేలింది. అయితే వీరు అనుమతి తీసుకున్న 9 చెట్లకు అదనంగా మరో 21 చెట్లను పూర్తిగా నరికివేశారు.

రెసిడెన్సియల్జోన్​కు అనుమతులు తీసుకొని, నాన్ రెసిడెన్సియల్​​జోన్​లో చెట్లను కొట్టేశారు. చెట్ల నరికివేతపై సంక్షేమ సంఘం ప్రతినిధులు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఆపై మేడ్చల్ ఎంఆర్వో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సంక్షేమ సంఘ ప్రతినిధులు ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్​కు కంప్లైంట్ చేశారు. దీంతో స్పందించిన ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ అధికారులు నిందితులకు రూ.20 వేల జరిమానాగా విధించగా.. పేట్ బషీరాబాద్ పోలీసులు పాషా, అజయ్ దేవ్, చెట్లు నరికేసిన బాలాజీపై కేసు నమోదు చేశారు.