అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి

అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు : జిల్లాలోని అర్హులందరికీ రేషన్ కార్డులు -అందజేస్తామని టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్​లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి,  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి సూర్యాపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్​కార్డుల ప్రొసీడింగ్​కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ సేవ కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 పేదవారి ఆత్మ గౌరవానికి రేషన్ కార్డులు చిహ్నం అని అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ​జిల్లాలో ఇప్పటివరకు 32,274 నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. దీంతో కొత్తగా 95,309 మందికి సన్నబియ్యం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో వేణుమాధవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్ది, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీఎస్ వో మోహన్ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.