డెడ్​బాడీ పైనుంచి రాత్రంతా వాహనాలు నడిచినయి

డెడ్​బాడీ పైనుంచి రాత్రంతా వాహనాలు నడిచినయి

రాజస్థాన్‌ జైపూర్‌‌లో దారుణం

జైపూర్‌‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిండు.. రోడ్డుపైనే పడి ఉన్న డెడ్​బాడీ పైనుంచి రాత్రంతా వాహనాలు నడిచినయి. దీంతో డెడ్​బాడీ గుర్తుపట్టలేనంత దారుణంగా మారింది. రాజస్థాన్‌ జైపూర్‌‌ హైవేపై బుధవారం రాత్రి  జరిగిందీ ఘోరం. పోలీసుల వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ వాహనం జైపూర్‌‌ హైవేపై యువకుడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి పూట జరిగిన ప్రమాదం కావడంతో హైవేపై పడి ఉన్న డెడ్‌బాడీని ఎవరూ చూడలే. మరుసటి రోజు  మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పాడు.

వెంటనే బంక్రోటా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హైవేపై ఉన్న శివమ్‌ హోటల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని హెడ్‌ కానిస్టేబుల్ చెప్పారు. డెడ్‌బాడీపై వెహికల్స్‌ పోనించడంతో శరీర భాగాలు రోడ్డుపై చెల్లచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 ఏండ్లు ఉంటుందని, కుడి చేతికి రాఖీ కట్టుకున్నాడని తదితర గుర్తులు పోలీసులు వెల్లడించారు. మృతుడి బంధువులతో పాటు అతన్ని ఢీకొట్టిన వెహికల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరనే వివరాలతో పాటు అతన్ని ఢీకొట్టిన వెహికల్‌ను ట్రేస్‌ చేసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.