హసన్ పర్తి లో స్కానింగ్ కోసమెళ్తే.. పేషెంట్ గోల్డ్ చోరీ

హసన్ పర్తి లో స్కానింగ్ కోసమెళ్తే.. పేషెంట్ గోల్డ్ చోరీ
  •     కుటుంబసభ్యులు అడిగితే.. తమకేం తెలియదంటూ బుకాయింపు  
  •     ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువుల ఆందోళన


హసన్ పర్తి,వెలుగు : పేషెంట్ మెడలోని ఆభరణాలు చోరీ అయిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. వంగపహాడ్ శివారులోని రిలీఫ్ ఆస్పత్రిలో జరిగిన ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

భూపాలపల్లి జిల్లా గుర్రంపేట గ్రామానికి చెందిన రాజనోజు రమాదేవి (55), పక్షవాతంతో మంగళవారం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. బుధవారం సాయత్రం స్కానింగ్ చేసేకంటే ముందు ఆమె ఒంటిపై ఉన్న తులంన్నర పుస్తెలతాడు, చైన్ తొలగించారు.  స్కానింగ్ తీసిన తర్వాత రమాదేవి వార్డుకు తీసుకెళ్లారు. 

అయితే ఆభరణాలు తిరిగి ఇవ్వలేదు. కొద్దిసేపటికి ఆమె కుటుంబసభ్యులు వార్డులోకి వచ్చిన చూడగా పేషెంట్ ఒంటిపై గోల్డ్ కనిపించలేదు. ఆమెను అడగగా స్కానింగ్ కు ముందు వైద్య సిబ్బంది తీశారని, కానీ.. తిరిగి ఇవ్వలేదని రమాదేవి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్య సిబ్బందిని నిలదీయడంతో తమకేం తెలియదని సమాధానం ఇచ్చారు. 

దీంతో ఆస్పత్రి మేనేజ్ మెంట్ తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తుందని పేషెంట్ బంధువులు ఎదుట ఆందోళన చేశారు. డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం     అందించారు. ఘటనా స్థలానికి హసన్ పర్తి పోలీసులు వెళ్లి, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. స్కానింగ్ రూమ్ లోకి  వెళ్లే ముందు రమాదేవి ఒంటిపై నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

విచారణ చేపడుతుండగా ఆస్పత్రి సిబ్బంది  నగలు తీసుకుని వచ్చి  రోగి బంధువులకు అందజేశారు. ఘటనపై హసన్ పర్తి ఎస్ఐ శీలం రవి వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.