ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్​రెడ్డి ప్రమాణ స్వీకారం

ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్​రెడ్డి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి గురువారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్​భవన్​లో గవర్నర్​తమిళిసై ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈటల రాజేందర్​ను తప్పించిన తర్వాత ఖాళీగా ఉన్న బెర్త్​ను మహేందర్​రెడ్డితో భర్తీ చేయబోతున్నారు. మహేందర్​రెడ్డితో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ను కేబినెట్​లోకి తీసుకుంటారని ప్రచారం జరిగినా ప్రస్తుతం ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

 రాష్ట్ర మంత్రివర్గంలో సీఎంతో పాటు 18 మందికే చాన్స్​ఉంది. ఇప్పటికే 17 మంది మంత్రులుగా ఉన్నారు. 3 నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేబినెట్​నుంచి ఎవరిని తప్పించినా ఆయా జిల్లాల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలుగా కేబినెట్​లో మహమూద్ ​అలీ, సత్యవతి రాథోడ్​ ఉన్నారు. వాళ్లిద్దరు మైనార్టీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

ఎన్నికలకు ముందు వారిని తప్పించి బీసీని కేబినెట్​లోకి తీసుకోవడం సరికాదనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణను మహేందర్​రెడ్డి ఒక్కరికే పరిమితం చేసినట్టుగా తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్​రెడ్డి.. కాంగ్రెస్​ అభ్యర్థి పైలెట్ ​రోహిత్​రెడ్డి చేతిలో ఓడిపోయారు.

తర్వాత పైలెట్​ బీఆర్ఎస్​లో చేరడంతో మహేందర్​ రెడ్డికి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్​పైలెట్​కే ఇవ్వడంతో పట్నం మహేందర్​రెడ్డిని బుజ్జగించడానికి కేబినెట్​లోకి తీసుకుంటున్నారు.