మళ్లీ కేబినెట్​లోకి పట్నం మహేందర్​రెడ్డి?

మళ్లీ కేబినెట్​లోకి  పట్నం మహేందర్​రెడ్డి?

హైదరాబాద్, వెలుగు:  మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డిని మళ్లీ కేబినెట్​లోకి తీసుకుంటారని బీఆర్ఎస్​లో జోరుగా ప్రచారం సాగుతున్నది. సోమవారం పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్​బదులిస్తూ.. ‘‘పట్నం మహేందర్ రెడ్డికి ఏం ఇస్తమో రెండు రోజుల్లో తెలుస్తది” అని సమాధానమివ్వడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది. బుధవారం రాజ్​భవన్​లో మహేందర్​రెడ్డి మంత్రిగా ప్రమాణం చేస్తారని, దానిపై మంగళవారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని బీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. 

2018 ఎన్నికల్లో తాండూరు నుంచి బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్​రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి పైలెట్​ రోహిత్​రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత రోహిత్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. మహేందర్​రెడ్డికి రంగారెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాండూరు టికెట్​ రాకుంటే మహేందర్​రెడ్డి బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో ఆయనను మంత్రి కేటీఆర్​ పిలిపించుకొని మాట్లాడారు. సోమవారం ఉదయం మహేందర్​రెడ్డిని కేసీఆర్ ​ప్రగతి భవన్​కు పిలిపించారు. రెండు రోజుల్లో మంచి నిర్ణయం ఉంటుందని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ప్రగతి భవన్​ నుంచి తన కాన్వాయ్​లోనే ఆయనను వెంట బెట్టుకొని తెలంగాణ భవన్​కు కేసీఆర్​ వచ్చారు. ఈటల రాజేందర్​ను తప్పించిన నాటి నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్​రెడ్డిని మంత్రిగా  చేస్తారని తెలుస్తున్నది.