నేడు( ఆగస్టు30) మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు

నేడు( ఆగస్టు30) మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు

సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి 2023 ఆగస్టు 30 బుధవారం రోజున బాధ్యతలు చేపట్టనున్నారు.  ఆగస్టు 24న మంత్రిగా  ప్రమాణ స్వీకరించిన  ఆయన..  సచివాలయం మొదటి అంతస్థులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గం టలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. పట్నంకు సీఎం కేసీఆర్.. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖలను కేటాయించారు.  అంతకుముందు సీఎం కేసీఆర్ వద్దే ఈ శాఖలు ఉండేవి.  

తాండూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన  పట్నం మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి సీఎం టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో మహేందర్‌రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానాన్ని మహేందర్‌రెడ్డితో భర్తీ చేశారు.

నాలుగుసార్లు తాండూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్‌రెడ్డి.. 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైలట్‌ రోహిత్‌రెడ్డిపై ఓడిపోయారు. అనంతరం పైలట్‌ రోహిత్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ లోనే చేరిపోయారు.  ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.