సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ మెరుపు దాడులు 

సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ మెరుపు దాడులు 

శివసేన ఎంపీ  సంజయ్ రౌత్  ఇంట్లో  ఈడీ  అధికారులు తనిఖీలు చేశారు. పాత్రా చాల్  ల్యాండ్ స్కామ్ లో  సంజయ్ రౌత్ కు  ఇప్పటికే రెండుసార్లు  అధికారులు సమన్లు  ఇచ్చారు . అయితే  సంజయ్ రౌత్  విచారణకు హాజరు కాకపోవడంతో  ఇవాళ ఉదయం  ఆయన నివాసానికి  చేరుకున్నారు. ఇంట్లో సోదాలు  నిర్వహించి సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు   ప్రశ్నిస్తున్నారు.

ఈడీ దాడులపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ పగతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదని..కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా శివసేనను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఎలా పోరాడాలో నేర్పించారు. తాను శివసేన కోసం పోరాడుతూనే ఉంటానని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు. సమన్లు అందుకుని ఈడీ విచారణకు సంజయ్ రౌత్ హాజరుకాకపోవడం పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన నిర్దోషి అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఆఫీస్ కు వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ప్రశ్నించారు. వరస ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టేందుకు సమయం ఉంది కానీ  దర్యాప్తు ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించడానికి సమయం లేదా  అన్నారు. సంజయ్ రౌత్‌కు ఈడీ జులై 20న సమన్లు ​పంపింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 7 తర్వాత మాత్రమే తాను హాజరవుతానని లాయర్ల ద్వారా తెలియజేశారు.

ఈడీ అధికారులు మెరుపు దాడుల చేయడంతో శివసేన కార్యకర్తలు ముంబయిలోని సంజయ్ రౌత్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్షపూరితంగా తమ నాయకుడిని వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.