
కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు
మహబూబాబాద్ జిల్లాలో కిరోసిన్ పోసుకున్న దివ్యాంగుడు
భూముల పట్టా సమస్యలే కారణం
పెట్రోల్ చల్లిన రైతుపై కేసు పెట్టిన పోలీసులు
చిగురుమామిడి, మహబూబాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో ‘పెట్రోల్’ కలకలం సృష్టిస్తూనే ఉంది. తమ భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఆవేదన, ఆగ్రహంతో రైతులు, ఇతర బాధితులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్నేండ్లుగా తిరుగుతున్నా సమస్య తీరడం లేదంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామాడి మండలంలో ఓ రైతు తహసీల్దార్ ఆఫీసు సిబ్బందిపై పెట్రోల్ చల్లాడు. మరోవైపు తన భూమి సమస్య పరిష్కరించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఓ దివ్యాంగ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
వారసత్వ భూమి పట్టా కోసం..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన జీల కనకయ్య అనే రైతు కొద్దిరోజులుగా తమ భూమి పట్టాకోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ పని కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాటిల్లో పెట్రోల్ తీసుకుని, చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఎన్నిరోజులుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ సీనియర్ అసిస్టెంట్ రాజా రాంచందర్ రావు, వీఆర్వో నర్సయ్య, అటెండర్ దివ్యపై, కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. వెంటనే వారంతా ఆఫీసులోంచి బయటికి పరుగెత్తుకువచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే తహసీల్దార్ ఆఫీసు వద్దకు చేరుకుని రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని పట్టా చేయాలంటూ ఏడాదిన్నరగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కనకయ్య వాపోయాడు.
తనకు వారసత్వంగా 4 ఎకరాల 26 గుంటల భూమి వచ్చిందని, కానీ ఇప్పటిదాకా 19 గుంటలే తన పేరిట చేశారని చెప్పాడు. లంచం అడిగితే ఇచ్చానని, అయినా పురుగును చూసినట్టు చూస్తున్నారని.. అంతగా ఇబ్బందిపెడుతున్నారన్న ఆవేదనతోనే ఇలా చేశానని పేర్కొన్నాడు. రైతు పెట్రోల్ చల్లాడన్న సమాచారంతో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, ఆర్డీవో ఆనంద్‌కుమార్ చిగురుమామిడి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చారు. సిబ్బందితో, రైతుతో మాట్లాడారు. రైతులు దాడులకు పాల్పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏసీపీ సూచించారు. కనకయ్యకు భూమిని పట్టా చేస్తామని చెప్పామని, తప్పకుండా న్యాయం చేస్తామని తహసీల్దార్ ఫారూఖ్ చెప్పారు. ఘటనకు సంబంధించి రైతు కనకయ్యపై పోలీసులు 307, 332, 353 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.