
ఐర్లాండ్ స్టార్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు.అంతర్జాతీయ క్రికెట్ లో ఐర్లాండ్ తరపున 10 వేల పరుగులు చేసిన తొలియూ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. బుధవారం (మే 21) డబ్లిన్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో స్టిర్లింగ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ కు 10 వేల పరుగుల క్లబ్ లోకి చేరుకోవడానికి స్టిర్లింగ్ కు 37 పరుగులు అవసరం.. 64 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. తొలి వికెట్ కు ఆండ్రూ బాల్బిర్నీతో కలిసి 109 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
2009లో టీ20 మ్యాచ్ తో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన స్టిర్లింగ్.. ఐర్లాండ్ తరపున టాప్ ఆటగాడిగా నిలిచాడు. స్టిర్లింగ్ కెరీర్ కు వస్తే 8 టెస్టుల్లో 352 పరుగులు..167 వన్డేల్లో 5979 పరుగులు.. 150 టీ20ల్లో 3656 పరుగులు చేశాడు. వీటిలో 16 సెంచరీలు ఉన్నాయి. స్టిర్లింగ్ తర్వాత ఆండీ బాల్బిర్నీ 6,129 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డేల్లో 6000 పరుగులను చేరుకోవడానికి స్టిర్లింగ్ కు మరో 21 పరుగులు కావాలి. వెస్టిండీస్ తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉండగా.. ఈ సిరీస్ లో వన్డేల్లో 6 వేల పరుగుల క్లబ్ లోకి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బాల్బిర్నీ (112) సెంచరీతో అదరగొట్టడంతో పాటు స్టిర్లింగ్ (54), హ్యారీ టెక్టర్ (56) హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్ తరపున అత్యధిక పరుగులు
10,017 పరుగులు - పాల్ స్టిర్లింగ్, 324 ఇన్నింగ్స్‌లలో (2008-2025)
6,129 పరుగులు - ఆండీ బాల్బిర్నీ, 235 ఇన్నింగ్స్‌లలో (2010-2025)
5,850 పరుగులు - కెవిన్ ఓ'బ్రెయిన్, 250 ఇన్నింగ్స్‌లలో (2006-2021)
5,480 పరుగులు - విలియం పోర్టర్‌ఫీల్డ్, 210 ఇన్నింగ్స్‌లలో (2006-2022)