
- రైతు సమస్యలపై రేణూ దేశాయ్ ప్రోగ్రాం.. స్టూడెంట్స్ తో జనసేనాని ముఖాముఖీ

కర్నూలు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఒకే జిల్లాలో పర్యటిస్తున్నారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. ఇవాళ కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు.
స్టూడెంట్స్ చెప్పినవన్నీ విన్న పవన్.. వారి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే మండలానికో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పెడతామన్నారు. ప్రభుత్వ విద్యలో కొత్త పాలసీ తెచ్చి, లోపాలను సవరిస్తానని అన్నారు. కర్నూలును అమరావతిని మించిన నగరంగా అభివృద్ధి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.
రైతు సమస్యలు తెలుసుకుంటున్న రేణూ

కర్నూలు జిల్లాలోనే పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ పర్యటిస్తున్నారు. సీమలో రైతుల కష్టాలను, వారి జీవన విధానాన్ని తెలుసుకునేందుకు ఇక్కడి పల్లెల్లోని ప్రజలను కలుసుకుంటున్నారామె. రైతు ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకుని, ఆ పరిస్థితి రాకుండా చేయాల్సిన పనులపై చర్చిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన అన్నదాతలను పరామర్శిస్తున్నారు. రైతులను కలుసుకోవడంపై ఆమెను మీడియా ప్రశ్నించగా.. తాను ఓ చానెల్ లో రైతులపై ప్రోగాం చేస్తున్నానని చెప్పారు. రైతు సమస్యలపై సమాజానికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అన్నదాతల ఇబ్బందులపై స్పందించాలని ఆమె అన్నారు.