OG Review: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ రివ్యూ.. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?

OG Review: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ రివ్యూ.. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG). సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా ఇవాళ గురువారం (సెప్టెంబర్ 25న) వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైంది. అయితే, ఒక రోజు ముందే అంటే బుధవారం ప్రీమియర్ షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమయ్యాయి.

ఈ క్రమంలో భారీ అంచనాలతో పవర్ ఫ్యాన్స్తో పాటు సినీ ఆడియన్స్ మూవీ చూసి వారి అభిప్రాయాలు X లో షేర్ చేస్తున్నారు. మరి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిన ఓజీ అసలు కథేంటీ? ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ ఎలాంటి సంభవం సృష్టించాడు? సుజీత్ ఫ్యాన్ బాయ్ మార్క్ చూపించాడా? లేదా ? అనేది తెలుసుకుందాం..

ఓజీ కథ:

1970 జపాన్లో కథ మొదలవుతుంది. కొంతమంది భారతీయులు అక్కడి దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్య దాదా (ప్రకాష్ రాజ్). ఆయనతో పాటు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) కూడా ముంబై వస్తాడు. సత్యా దాదా చుట్టూ ఒక కోటలా, రక్షణలా నిలబడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోతాడు గంభీరా.

ఆయన వదిలేసి వెళ్లిపోయిన తర్వాత ఓమి (ఇమ్రాన్ హష్మీ) ముంబైలో అడుగుపెట్టి సత్యా దాదా మనుషులను చంపేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ముంబైకి వస్తాడు ఓజాస్ గంభీరా. అప్పుడు ఏం జరిగింది? అసలు ఓమి ముంబై రావడానికి కారణం ఏంటీ?

మధ్యలో ఈ కన్మణి (ప్రియాంక మోహన్) ఎవరు? ఆమె గంభీర జీవితంలోకి ఎలా వచ్చింది? ఓజీకీ జపాన్‌లోని సమురాయ్ వంశానికీ సంబంధం ఏమిటి? అర్జున్‌ (అర్జున్‌ దాస్‌) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి? చివరికి ఓమితో ఓజీ ఎలాంటి యుద్ధం చేశాడనేది మిగిలిన కథ.

ప్రీమియర్ ఆడియన్స్ టాక్ ఏంటంటే?

డైరెక్టర్ సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ప్రజెంట్ చేసిన తీరు ముందు ‘ఓజీ’ కథ చిన్నబోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ ముందు, ఇందులో ఉన్న బలమైన ఎమోషన్ కనిపించలేదని ట్వీట్స్ పెడుతున్నారు.

స్టోరీ జపాన్‌లో స్టార్ట్ అయ్యి.. ముంబైలో హీరో ఎంట్రీ ఇచ్చే సీన్, ఈ క్రమంలో వచ్చే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఆడియన్స్కి మాస్ ఫీస్ట్లా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి హై మూమెంట్స్ పవన్ కనిపించిన ప్రతిసారీ ఉండేలా డిజైన్ చేశాడట డైరెక్టర్ సుజీత్. అయితే, సినిమాలో బలమైన కథ, ఎమోషన్స్, ట్విస్టులు లేకపోవడమే నిరాశ కలిగిస్తుందని సినిమా చూసిన ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేసుకున్నారు. ‘‘ OG ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా. మూవీ టెక్నీకల్గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించింది. సినిమా మొత్తం పవర్ ఫుల్ ఎలివేషన్ బ్లాక్‌లతో నిండిపోయింది. కానీ, కథ, ట్విస్టులు, ఎమోషన్స్ వంటి అంశాలు లేకపోవడంతో నార్మల్గా అనిపిస్తుంది.

సినిమా ఫస్టాఫ్ బాగుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, హీరోయిజం ఎక్కువ ఎలివేట్ అయ్యింది. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి సీన్ అభిమానులకు 'హై' ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్, క్లైమాక్స్ బ్లాక్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ని మెప్పించడంలో సుజీత్ గ్రాండ్ మార్క్ క్రియేట్ చేసాడు. అయితే, సినిమాలో ట్విస్టులు, ఎమోషన్స్పై లేకపోవడంతో కాస్తా వెలితిగా అనిపిస్తుంది.

పవన్ కల్యాణ్ మార్క్ ప్రతి సీన్లో స్పెషల్గా కనిపిస్తుంది. ఈ సినిమాతో కొత్త పవర్ స్టార్ని చూస్తారు. ఇక ఓవరాల్గా తమన్ తన మ్యూజిక్తో బ్లాక్ బస్టర్ తాండవం సృష్టించాడు. ఈ సినిమాకి తమన్ అతిపెద్ద బలంగా నిలిచాడు. తనదైన సంగీతంతో ఓజీకి ప్రాణం పోశాడు. రవి కె.చంద్రన్‌, మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ సైతం సినిమాని ఉన్నతంగా నిలబెట్టింది’’ అని నెటిజన్ ట్వీట్ చేశాడు.

‘‘ సుజీత్ డైరెక్ట్ చేసిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ మూవీ ‘ఓజీ’. కథ కంటే, ఎలివేషన్ సీన్స్తో సినిమా మొత్తం నిండిపోయింది. ఫస్టాఫ్ కథతో ఆడియన్స్ని ఎంగేజ్ చేసే సీన్స్ ఉన్నాయి. అయితే, సెకండాఫ్ మాత్రం కన్ ఫ్యూస్ చేసే సబ్‌ప్లాట్‌లతో సాగిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే.. థమన్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్. పవర్ స్టార్ ఫ్యాన్స్కి OG అద్భుతమైన మూమెంట్స్ని మాత్రం అందిస్తుంది’’ అని మరో నెటిజన్ తన రివ్యూ షేర్ చేశారు.