కేసీఆర్ జోలికెళితే.. పవన్ కల్యాణ్ మక్కెలు ఇరుగుతాయ్ : మంత్రి రోజా

కేసీఆర్ జోలికెళితే.. పవన్ కల్యాణ్ మక్కెలు ఇరుగుతాయ్ : మంత్రి రోజా

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రెండోరోజూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.

ఆడవాళ్ల అక్రమ రవాణా అనడం దారుణమని, అంటే వుమెన్ ట్రాఫికింగ్ కోసం వాలంటీర్లు ఉద్యోగం చేస్తున్నారా? అని మంత్రి రోజా  నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నారన్నారు. పవన్ మాటలు సిగ్గుచేటని... ఆయన  చెప్పే అబద్దాలకు కూడా  క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం వుమెన్ ట్రాఫికింగ్ లో టాప్ 10లోనే ఏపీ లేదని, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని, అక్కడకు వెళ్లి కేసీఆర్ ను ప్రశ్నించగలవా? అని నిలదీశారు. ‘కేసీఆర్ ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా…? మాట్లాడితే నీ మక్కెలు ఇరగ్గొడతారు.. హైదరాబాద్ లో బతకలేనని అక్కడ మాట్లాడవని రోజా ఫైరయ్యారు.

పవన్ కల్యాణ్ సిగ్గూఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మహిళలు, వాలంటీర్లు అంటే పవన్ కల్యాణ్ కు ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. మూడు రోజులుగా పవన్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ దుర్మార్గంగా మాట్లాడారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న మంత్రి రోజా వాలంటీర్ల వ్యవస్థను చూసి పవన్ వణికిపోతున్నారని విమర్శించారు.వాలంటీర్లు, మహిళలపై గౌరవం లేకుండా పవన్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను నడ్డి విరుస్తానంటూ మాట్లాడుతున్నారన్నారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను  ఏకవచనంతో పిలుస్తానంటూ పవన్ చెప్పడాన్ని రోజా తప్పుపట్టారు. నీకే ప్రజల్లో గౌరవం లేదు.. నువ్విచ్చే గౌరవం మాకు అవసరం లేదు.. అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారని, పవన్ లాంటి వ్యక్తి ఇచ్చే గౌరవం తమకు అవసరం లేదని చెప్పారు. 36 సంవత్సరాల వయస్సులో జగన్ మొదటిసారిగా ఎంపీ అయ్యారని, 55 ఏళ్లు వచ్చినా పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయాడంటూ రోజా ఎద్దేవా చేశారు. సరిగ్గా పదేళ్లుతిరిగే సరికి 151 మంది శాసన సభ్యుల బలంతో ముఖ్యమంత్రి అయ్యారని ఆమె గుర్తు చేశారు. దమ్ముంటే జగన్‌ను సింగులర్‌తో పిలవడం కాదని.. సింగిల్‌గా పోటీకి రావాలంటూ రోజా సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టి, గెలిచి దమ్ము ఏంటో నిరూపించుకోవాలని అన్నారు. పవన్ కల్యాణ్‌కు వయస్సు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదంటూ రోజా మండిపడ్డారు.