పవార్​ మనోడే.. పరేషానొద్దు

పవార్​ మనోడే.. పరేషానొద్దు

ఎమ్మెల్యేలకు ధైర్యం నూరిపోస్తున్న శివసేన
సర్కారు ఏర్పాటులో సాగదీతపై ఎమ్మెల్యేల్లో ఆందోళన
పవార్​ పాలిటిక్స్​ అర్థం కావాలంటే వందజన్మలెత్తాలి: సేన ఎంపీ రౌత్​ కామెంట్​
బీజేపీ, శివసేన లొల్లిపై ఆర్​ఎస్ఎస్ అసహనం

ముంబై/న్యూఢిల్లీమహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్ చేసిన కామెంట్లు శివసేన శిబిరంలో అలజడి రేపాయి. ఎన్నికల ఫలితాలొచ్చి పాతిక రోజులు పూర్తయినా సర్కారు ఏర్పాటు ఓ కొలిక్కిరాకపోవడం సేన ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నది. పార్టీ చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే ముందే కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో శివసేన హైకమాండ్​ డ్యామేజ్​ కంట్రోల్​కు రెడీ అయింది. ‘‘పవార్​ మనవాడే.. వచ్చేది శివసేన ప్రభుత్వమే’’అని ఎమ్మెల్యేల్లో ధైర్యంనింపే పనికి పూనుకుంది. మంగళవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన సేన ఎంపీ సంజయ్​ రౌత్​ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘శరద్​ పవార్​ మాటల్ని అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలి. అయినా మా పొత్తు గురించి మీరు(మీడియా) పరేషాన్​ కావాల్సిన అవసరమేముంది? డెఫినెట్​గా మహారాష్ట్రలో ఏర్పడేది శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్​ సంకీర్ణ ప్రభుత్వమే.

డిసెంబర్​ ఫస్ట్​ వీక్​లో సేన కేండిడేట్​ సీఎంగా ప్రమాణం చేస్తారు”అని సంజయ్​ రౌత్​ వివరించారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్​ చీఫ్​ సోనియాతో భేటీ తర్వాత ఎన్సీపీ చీఫ్​ పవార్​ మీడియాతో మాట్లాడుతూ.. శివసేనకు మద్దతుపై సోనియాతో చర్చించలేదని తెలిపారు. ‘‘వేరే కూటమిలోని శివసేనతో ఎన్సీపీ–కాంగ్రెస్ ఎలా కలుస్తాయి? మా రాజకీయాలు మేం చూసుకుంటాం’’ అని చెప్పుకొచ్చారు. శివసేన మాత్రం ఎన్సీపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేస్తామని అంటున్నది కదా? అని అడగ్గా.. ‘‘నిజమా?’’అని పవార్​ ఎదురుప్రశ్నవేశారు. కామన్​ మినిమమ్​ ప్రోగ్రామ్​(సీఎంపీ) ఖరారు కావాలంటే శివసేన వైఖరిలో కొన్ని మార్పులు అవసరమని సోనియా భావిస్తున్నారని, సేన నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే ముందుకెళదామని పవార్​కు స్పష్టం చేశారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఎన్సీపీ, కాంగ్రెస్​ భేటీ వాయిదా

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్నది చర్చించుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్​ చేపట్టదల్చిన భేటీ బుధవారానికి వాయిదా పడింది. సోనియాతో పవార్​ సమావేశం తర్వాత జరుగుతున్న భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు పార్టీలు సేనతో కలిసివెళతాయా? లేదా? అనేదానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బీజేపీ, శివసేనకే నష్టం: మోహన్​ భగవత్​

హిందుత్వ పార్టీల కలయికగా అభివర్ణించిన మహాయుత్​(మహాకూటమి) నిట్టనిలువునా చీలడం, సీఎం సీటుపై బీజేపీ, శివసేన గొడవలు పడటం, ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతకీ ముందుకు రాకపోవడంతో చివరికి రాష్ట్రపతి పాలన విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ తొలిసారి స్పందించారు. మంగళవారం నాగ్​పూర్​లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, శివసేన లొల్లిపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘కేవలం ఒకే ఒక పాయింట్​పై పంతం, పట్టుదలకు పోవడం వల్ల రెండు పక్షాలకూ నష్టం జరుగుతుంది. స్వార్థం మనిషిని ఆగం పట్టిస్తుందని అందరికీ తెలుసు. కానీ కొంతమందే నిస్వార్థంగా ఉండగలుగుతారు’’అని భగవత్​ అన్నారు.