బ్యాంకాక్: రెండు చేతులు, రెండు కాళ్లు లేకపోయినా.. ఒడిశా ఆర్చర్ పాయల్ నాగ్ వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన కాంపౌండ్ విమెన్స్ ఫైనల్లో పాయల్ 139–136 తేడాతో ఇండియాకే చెందిన వరల్డ్ నంబర్‌వన్ పారా ఆర్చర్ శీతల్ దేవిపై గెలిచి గోల్డ్ మెడల్‌ను సాధించింది. దాంతో నాలుగు అవయవాలు లేకుండా పోటీపడి ఇంటర్నేషనల్ మెడల్ నెగ్గిన తొలి ఆర్చర్‌గా పాయల్ రికార్డులకెక్కింది.
ఒడిశాలోని బలాంగిర్ జిల్లాకు చెందిన ఓ వలస కూలీ కుమార్తె అయిన పాయల్.. 2015లో ఇటుక భట్టీలో జరిగిన ఓ విద్యుత్ ప్రమాదంలో చేతులు, కాళ్లు కోల్పోయింది. విధి వెక్కిరించినా.. ఆటలో మాత్రం దూసుకొస్తోంది. 2023–24 మధ్యకాలంలో కత్రాలోని మాతా వైష్ణో దేవి బోర్డు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శీతల్‌తో కలిసి శిక్షణ తీసుకుంది.
ఏడాది వ్యవధిలోనే శీతల్‌పై రెండోసారి గెలిచింది. గతేడాది జనవరిలో జైపూర్‌లో జరిగిన పారా నేషనల్స్‌లో శీతల్‌పై పాయల్ తొలిసారి నెగ్గింది. ఇక కెరీర్‌లో రెండో ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆడిన పాయల్ ఈ టోర్నీలో అద్భుతమైన గురితో గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
మెన్స్ కాంపౌండ్ ఫైనల్లో తోమన్ కుమార్ 146–142తో జొనాథన్ మిల్నే (ఆస్ట్రేలియా)పై, రికర్వ్ ఫైనల్లో భావన 6–0తో పాతరపోన్ పట్టావియో (థాయ్‌లాండ్)పై గెలిచి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. శ్యామ్ సుందర్ స్వామి కాంస్యం నెగ్గాడు. మెన్స్ రికర్వ్ ఫైనల్లో ఓడిన హర్వీందర్ సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా 16 మెడల్స్ (7 గోల్డ్, 5 సిల్వర్, 4 బ్రాంజ్) కైవసం చేసుకుంది.
