PBKS vs SRH: ఆదుకున్న వైజాగ్ కుర్రాడు.. గట్టెక్కిన స‌న్‌రైజ‌ర్స్

 PBKS vs SRH: ఆదుకున్న వైజాగ్ కుర్రాడు.. గట్టెక్కిన స‌న్‌రైజ‌ర్స్

ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‍లో హైద‌రాబాద్ సరైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. కష్టాల్లో కూరుకుపోయిన స‌న్‌రైజ‌ర్స్‌ను వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి(64; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆదుకున్నాడు. ఐపీఎల్‌‌లో తొలి హాఫ్ సెంచరీ చేసి జట్టును పోరాడే స్థితిలో నిలిపాడు. అతనికి తోడు ఆఖరిలో అబ్దుల్ సమద్(25; 12 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో.. స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 

హెడ్ మెరుపులు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్(21), అభిషేక్ శ‌ర్మ(16) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాగా.. కగిసో రబాడ వేసిన మూడో ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దీంతో తొలి మూడు ఓవర్లలో హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఆ సమయంలో అర్షదీప్ సింగ్ దెబ్బతీశాడు. వరుస బంతుల్లో హెడ్, మార్క్రామ్(0)లను ఔట్ చేసి ఎస్ఆర్‌హెచ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 

ఆ సమయంలో నితీష్ రెడ్డి(64) జట్టును ఆదుకున్నాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. చివరలో అబ్దుల్ సమద్(25) పర్వాలేదనిపించాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా విలువైన పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4,  హర్షల్ పటేల్ 2, సామ్ కరణ్ 2, రబడ ఒక వికెట్ తీసుకున్నారు.