SRH vs PBKS: ఉత్కంఠ పోరు.. 2 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

SRH vs PBKS: ఉత్కంఠ పోరు.. 2 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో హైద‌రాబాద్ జట్టు 2 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత నితీష్ రెడ్డి(64; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆదుకోవడంతో 182 పరుగుల భారీ స్కోర్ చేసిన స‌న్‌రైజ‌ర్స్. .అనంతరం పంజాబ్ కింగ్స్‌ను 180 పరుగులకు పరిమితం చేసింది. ఇది హైద‌రాబాద్ జట్టుకు మూడో విజయం.  

భారీ ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్‌ బ్యాటర్లు ఆదిలోనే తడబడ్డారు. హైద‌రాబాద్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, పాట్ కమ్మిన్స్ నిప్పులు చెరగడంతో.. పంజాబ్ 20 ప‌రుగుల‌కే 3 కీలక వికెట్లు కోల్పోయింది. క‌మిన్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో(0) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(4)ను భువనేశ్వర్ వెన‌క్కి పంపాడు. ఆపై ధాటిగా ఆడే ప్రయ‌త్నంలో శిఖర్ ధావన్(14) క్లాసెన్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు.

భయపెట్టిన లోయర్ ఆర్డర్

ఆ సమయంలో సామ్ క‌ర‌న్‌(29), సికింద‌ర్ ర‌జా(28) జోడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని నటరాజన్ విడదీశాడు. సామ్ క‌ర‌న్‌ ను ఔట్ చేసి 38 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై కొద్దిసేపటికే రజాను జయదేవ్ ఉనద్కత్ బోల్తా కొట్టించాడు. చివరలో గత మ్యాచ్ హీరోలు అశుతోష్ శర్మ(33; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్(46; 25 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఏకంగా 27 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ వేసిన ఉనద్కత్.. హైదరాబాద్ జట్టును ముంచేలా కనిపించినప్పటికీ.. తన అనుభవంతో గట్టెక్కించాడు. స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా అందుకు ఒక కారణమే.

రాణించిన వైజాగ్ కుర్రాడు 

అంతకుముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 182 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ బ్యాట‌ర్లంతా తడబడిన చోట వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(64) తన సుడిగాలి ఇన్నింగ్స్ తో జట్టును గట్టెక్కించాడు. ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి తోడుగా ఆఖరిలో అబ్దుల్ స‌మ‌ద్‌(25), ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్(14) విలువైన పరుగులు చేశారు.