
- నేడు రాత్రి అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పీసీసీ పిలుపు
- 22 నుంచి వచ్చే నెల 7 వరకు నిరసన ప్రదర్శనలు
- అదే నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు సంతకాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: ఓట్ల దోపిడీపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమం చేపట్టింది. “ఓట్ చోర్.. గద్దీ చోడ్” నినాదంతో అన్ని రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మూడు దశల్లో నిరసనలు తెలపనుంది. గురువారం రాత్రి అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 7 వరకు రాష్ట్ర స్థాయిలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇక వచ్చే నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల పాటు గడప గడపకూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు.
నేతలకు పీసీసీ చీఫ్ దిశానిర్దేశం..
జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో పార్టీ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారంజూమ్ మీటింగ్నిర్వహించి.. కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం రాత్రి 8 గంటలకు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ర్యాలీల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలు పాల్గొనాలని కోరారు.
ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ, ఈసీ కుమ్మక్కయి ఓట్లను ఎలా దోచుకుంటున్నాయో ప్రజలకు వివరించాలని కోరారు. వచ్చే నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలు సేకరించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని.. మన రాష్ట్రంలో ఎక్కువ సంతకాల సేకరణ చేయాలని పిలుపునిచ్చారు.
నెలాఖరులోగా మండల కమిటీలు: పీసీసీ చీఫ్
గ్రామ, మండల, జిల్లా కాంగ్రెస్ కమిటీలను వెంటనే నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా మండల కమిటీలు వేయాలని, సెప్టెంబర్ 15 వరకు గ్రామ కమిటీలను పూర్తి చేసి జాబితా పంపించాలన్నారు.
ఈ నెల 24 నుంచి రెండో విడత జనహిత పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని, దాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ యాత్రకు భారీగా జన సమీకరణ చేయాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటూ, వారికి భరోసా కల్పించాలని సూచించారు.