మెట్రో విస్తరణతో ఎల్బీనగర్​ రూపురేఖలు మారుతయ్

మెట్రో విస్తరణతో ఎల్బీనగర్​ రూపురేఖలు మారుతయ్
  •     ఆత్మీయ సమ్మేళనంలో మధుయాష్కీ గౌడ్

ఎల్బీ నగర్, వెలుగు : హయత్ నగర్ వరకు మెట్రో విస్తరిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం డివిజన్ల కాలనీ సంక్షేమ సంఘాలు, కాంగ్రెస్ నాయకులతో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మధుయాష్కి గౌడ్ తోపాటు, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు, శివారు ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జీఓ నంబర్118 ద్వారా బీఎన్​రెడ్డినగర్, నాగోల్ డివిజన్లలోని పలు కాలనీల్లో చేపట్టిన రెగ్యులరైజేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని, రెగ్యులరైజేషన్  పేరిట ఇచ్చిన కన్వీనియన్స్ డీడ్ లు చెల్లుబాటు గాక యజమానులు అవస్థలు పడాల్సి వస్తుందన్నారు.

ఓట్ల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం, స్థానికఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్, పార్టీ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న, ఆయా డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.