హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ ఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. విచారణ చట్ట ప్రకారమే ఉంటుందని, తమ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత జైల్లో ఉండేవారని అన్నారు.
గురువారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజ య్ చట్టంపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్‌పై ఇప్పుడు సీఎం రేవంత్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలని బండి సంజయ్ అనడం కరెక్టు కాదన్నారు. కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంలో గవర్నర్ వద్ద జరిగిన ఆలస్యానికి కారణమేంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేసును సీబీఐకి అప్పగించామని, ఇప్పటి వరకు దానిపై ఎందుకు విచారణ ప్రారంభం కాలేదో ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు జవాబు చెప్పాలన్నారు.
నిజాయతీపరుడైతే కోర్టుకెళ్లొద్దు: మధుసూదన్ రెడ్డి
ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అని అంటున్న కేటీఆర్.. నిజంగానే నిజాయతీపరుడైతే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించొద్ద ని, విచారణను ఎదుర్కోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి
తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతివ్వ డం రాజ్యాంగబద్ధమైన నిర్ణయమని, ఇది కక్ష సాధింపు చర్యలు ఎంతమాత్రం కావని తెలిపారు.
కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని దయాకర్
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. కేటీఆర్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు అన్ని ఆధారాలు ఉన్నా.. ఆయనలో ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదని ఫైర్ అయ్యారు.
ముందు అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలి: ఎంపీ చామల
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌పై చార్జ్‌షీట్‌ను ఫైల్ చేయాలంటే ముందుగా ఏ2 గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు డీవోపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, అయితే ఆయనను ప్రాసిక్యూట్ చేసే అనుమతి ఇవ్వకుండా బీజేపీ నేతలు అక్కడ ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. డీవోపీటీ నుంచి అనుమతి ఇప్పించి అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు బండి సంజయ్, కిషన్‌రెడ్డి సహకరించాలని కోరారు.
