- ఓటర్ల జాబితాలో అక్రమాలు అరికట్టేందుకు వరుస సమీక్షలు
- బీఎల్‌ఏ, ఎస్ఎస్ఏలతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో జరుగుతున్న ప్రక్రియలో తెలంగాణ, పంజాబ్ ను బీజేపీ నెక్స్ట్ టార్గెట్ గా చేసుకుంటోందని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ ఆరోపించారు. అందుకే ఈ ప్రక్రియలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు పీసీసీ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. సర్ లో అక్రమాల నివారణ కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామని, పార్టీ నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగానే బీఎల్‌ఏ, ఎస్ఎస్‌ఏలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శనివారం రెండో రోజు కూడా ‘సర్’ అంశంపైనే పీసీసీ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించింది. శుక్రవారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ‘సర్’ పై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేయగా, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమీక్ష సమావేశాలు కొనసాగాయి.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో ఈ సమీక్షలు ప్రారంభం కాగా, ఈ నియోజకవర్గ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ కృష్ణతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత జహీరాబాద్, మెదక్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ నియోజకవర్గ సమీక్షలు కొనసాగాయి. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. దేశంలో సెక్యులర్ ఓట్లను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ‘సర్’ ప్రక్రియను కొనసాగిస్తోందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ లో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించి, 30 లక్షల కొత్త ఓట్లను మాత్రమే చేర్చారని.. అందుకే అక్కడ బీజేపీ గెలిచిందన్నారు. అందుకే ఇక్కడ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు తొలగించకుండా చూసేందుకు ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. పార్టీ తరపున బీఎల్‌ఏలు, ఎస్‌ఎస్‌ఏలు వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని చెప్పారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ వీరు ఏ ఒక్క అర్హుడి ఓటు జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
మీనాక్షి నటరాజన్ తో జగ్గారెడ్డి భేటీ
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో శనివారం సాయంత్రం గాంధీ భవన్ లో పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదులు చేయలేదని, తన మనస్తత్వం అది కాదన్నారు. కాంగ్రెస్ లో విభేదాలు, వాదనలు సహజమన్నారు.
నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ సంస్కృతిలో భాగమన్నారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమని, అందుకే పార్టీ కేడర్ ను ఇప్పటినుంచే అప్రమత్తం చేసి పార్టీ కోసం పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేయాలని మీనాక్షి నటరాజన్ కు సూచించినట్లు జగ్గారెడ్డి చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన కొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
