- అందుకే ఉపాధి హామీ నుంచి పేరు తీసేసిన్రు: మహేశ్ గౌడ్
- గాంధీ ఫ్యామిలీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని పీసీసీ చీఫ్ విమర్శ
- స్కీమ్‌లో కేంద్రం వాటా తగ్గించడం సరికాదు: మంత్రి వివేక్
- కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం ఆగదని కామెంట్
- స్కీమ్ లేకుండా చేసేందుకు కేంద్రం కుట్ర: మంత్రి శ్రీధర్ బాబు
- ‘ఉపాధి’ నుంచి గాంధీ పేరు తొలగించడంపై పీసీసీ ఆధ్వర్యంలో నిరసన
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్రం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు శనివారం సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, వెలుగు: గాంధీ పేరు వింటేనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెన్నులో వణుకుపుడ్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. అందుకే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించారని ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబాన్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం ఇద్దరికీ లేదని దుయ్యబట్టారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్రం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘మోదీ, అమిత్ షా గాడ్సేను పూజించే వ్యక్తులు.
అందుకే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించారు. గాంధీ పేరు పలికితే ప్రజల హృదయాల్లో సోనియా, రాహుల్, ప్రియాంక నిలుస్తారు. అందుకే ఆ పదం వినిపించొద్దనే ఉద్దేశ్యంతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నది. దేశంలో మనుస్మృతిని అమలు చేసేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నది.
గాంధీ, నెహ్రూలకు ఉన్న అభిమానాన్ని ఎవరూ చెరిపేయలేరు. లౌకికవాద దేశంలో మోదీ పప్పులు ఉడకవు. కులాలు, మతాల పేరిట రాజకీయం చేసే వారికి గుణపాఠం తప్పదు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. రాహుల్ ప్రధాని అవుతారు’’అని మహేశ్ గౌడ్ అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గమైన జూబ్లీహిల్స్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ రాలేదని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని విమర్శించారు.
నిధుల్లో కోత పెట్టింది: శ్రీధర్ బాబు
ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత పెట్టిన కేంద్రం, ఇప్పుడు ఏకంగా పేరునే మార్చిందని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని లేకుండా చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు గ్రామ, గ్రామానికి వెళ్లి గాంధీ పేరు తొలగింపుపై కేంద్రం కుట్రలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ ధర్నాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ఇతర నేతలు పాల్గొన్నారు.
‘ఉపాధి’లో కేంద్రం వాటా తగ్గించారు: వివేక్ వెంకటస్వామి
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ స్కీమ్‌లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్రం వాటా 10 శాతం ఉండేదని, ఇప్పుడు పేరుతో పాటు నిబంధనలూ మార్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘కొత్తగా రామ్ జీ స్కీమ్ కింద కేంద్రం వాటాను 90 నుంచి 60 శాతానికి తగ్గించి, 10 శాతం ఉన్న రాష్ట్ర వాటాను 40 శాతానికి పెంచారు.
దీంతో రాష్ట్రంపై ఏటా రూ.1,300 కోట్ల అదనపు భారం పడుతుంది. పేదలను ఉపాధికి దూరం చేసే కుట్ర జరుగుతున్నది. కరోనా టైమ్‌లో ఈ పథకం ద్వారా పేదలు ఉపాధి పొందారు. నాలుగు పూటలు తినగలిగారు. అలాంటి పథకాన్ని ఇప్పుడు మోదీ నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపారు. పార్లమెంట్ లో మోదీని రాహుల్ నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేకపోయారు.
ఈ పథకంలో గాంధీ పేరు తొలగించడం బాధాకరం’’అని వివేక్ అన్నారు. గాంధీ పేరు తొలగింపు విషయంలో కేంద్రం దిగొచ్చేదాకా కాంగ్రెస్ తరఫున తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించి గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.
