మార్వాడీలు మనలో ఒకరు..వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మార్వాడీలు మనలో ఒకరు..వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తగిన చర్యలుంటయ్
  • పరిశీలించమని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి సూచించామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మార్వాడీలు మనలో ఒకరని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్ అన్నారు. వారిని ఇక్కడి నుంచి వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల మార్వాడీలు, తెలంగాణవాదులకు నడుమ ముదురుతున్న వివాదంపైన మహేశ్​గౌడ్ ​స్పందించారు. మార్వాడీ గో బ్యాక్​ అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన సూచించారు. కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సూచించినట్టు మహేశ్ గౌడ్ తెలిపారు.

‘రాజగోపాల్ రెడ్డి ఎందుకు  అలాంటి కామెంట్లు చేస్తున్నారో.. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో పరిశీలించాలని శనివారం మల్లు రవికి ఫోన్ చేసి చెప్పాను. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదు, కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు తీసుకెళ్తున్నారు అనే రీతిలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టు అర్థం అవుతోంది. ఏదిఏమైనా ఆయన వ్యాఖ్యలకు గల కారణాలను క్రమ శిక్షణ కమిటీ తెలుసుకొని తగిన విధంగా వ్యవహరిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో  ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, దీనిపై పార్టీ పరంగా త్వరలోనే స్పష్టత వస్తుందని మహేశ్ గౌడ్ చెప్పారు. 

కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధం

అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ​మహేశ్​ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్​లోని ప్రకాశం హాల్​లో జరిగిన కాంగ్రెస్ అనుబంధ అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సంఘం ( కేకేసీ) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో అసంఘటిత కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి, వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

దేశంలోని అసంఘటిత కార్మికులను ఆదుకోవాలనేది రాహుల్ గాంధీ ఆలోచనా విధానమని, తెలంగాణలో ఈ రంగంలోని వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేకేసీ జాతీయ అధ్యక్షుడు ఉదిత్ రాజ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.