ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే హిల్ట్ పాలసీ : చీఫ్ మహేశ్గౌడ్

ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కు  రావొద్దనే హిల్ట్ పాలసీ : చీఫ్ మహేశ్గౌడ్
  • ప్రజాపాలన విజయోత్సవాల డైవర్ట్ కోసమే 
  • బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ విమర్శించారు. మాజీ సీఎం రోశయ్య వర్థంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి మహేశ్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఢిల్లీ మొత్తం కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతోందని.. అక్కడి పరిస్థితి హైదరాబాద్ కు ఎదురుకాకుండా ఉండేందుకు హిల్ట్ పాలసీని తీసుకురావడం జరిగిందని అన్నారు. దీని ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు భూముల ధరలు తగ్గుతాయని చెప్పారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటే పెదవి విప్పని బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. 

సామెతలాగా సీఎం రేవంత్ హిందూ దేవుళ్లపై మాట్లాడితే బీజేపీ వాళ్లు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు కులం, మతం ప్రస్తావించకుంటే పూటగడవదని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ లోపల, అవతలి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినప్పుడు కిషన్  రెడ్డి ఎక్కడున్నారని, ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ప్రతిష్టిస్తున్న సందర్భంలో కొందరు ప్రాంతం, కులం, మతం పేరిట రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఆపాదించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.