బనకచర్లపై బీఆర్ఎస్ అబద్ధాలు : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్

బనకచర్లపై బీఆర్ఎస్ అబద్ధాలు : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్
  • దానిపై చర్చ జరగలేదని సీఎం చెప్పినా అసత్య ఆరోపణలు: పీసీసీ చీఫ్ మహేశ్ 

మెదక్, వెలుగు: అధికారం పోయిందన్న అక్కసు, కడుపులో మంట పెట్టుకొని బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ‘‘రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాడు కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీశ్‌‌‌‌రావు సంతకం పెట్టారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. బనకచర్ల మీద చర్చ జరగలేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా బీఆర్ఎస్ లీడర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 

బనకచర్లకు ఒక చుక్క నీటిని కూడా పోనివ్వం. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రావట్లేదు. తానే ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు వస్తానని సీఎం చెప్పినా వాళ్లు స్పందించడం లేదు” అని ఫైర్ అయ్యారు. పదేండ్లు అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇక  అబద్ధాలతో ఎంతో కాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. లీలా గ్రూప్ చైర్మన్, సంఘ సేవకులు మోహన్ నాయక్‌‌‌‌తో పాటు మెదక్ సెగ్మెంట్‌‌‌‌లోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌‌‌‌లు, నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మహేశ్ గౌడ్ మాట్లాడారు. తన వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. బీసీలతో ఆమెకేం సంబంధమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా  గ్రంథాలయ సంస్థ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ సుహాసిని రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి 

కేసీఆర్ పాలనలో దోచుకునుడు తప్ప.. చేసిందేమీ లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘రైతులను కోటీశ్వరులను చేస్తానని, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ ఇచ్చిన మాట తప్పారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడం తప్ప.. ఆయన చేసిందేమీ లేదు” అని అన్నారు. కార్యకర్తల జోష్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.