అమరుల స్మారక నిర్మాణంలో అవినీతి..కేటీఆర్ కమీషన్లు దండుకున్నరు: రేవంత్​

అమరుల స్మారక నిర్మాణంలో అవినీతి..కేటీఆర్ కమీషన్లు దండుకున్నరు: రేవంత్​
  • నిర్మాణ ఖర్చులను 63.75 కోట్ల నుంచి 179.25 కోట్లకు పెంచిన్రు
  • శిలాఫలకంపై అమరుల పేర్లు లేకుండా స్మారకమా?
  • తెలంగాణ ఉద్యమ చరిత్రకు కేసీఆర్ మకిలి పట్టిస్తున్నరు
  • ప్రగతిభవన్​ను 9 నెలల్లో కట్టి.. స్మారకాన్ని 9 ఏండ్లు కడ్తరా?
  • అధికారంలోకి వచ్చాక అవినీతిపై ఎంక్వైరీ చేయిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అమరుల స్మారక చిహ్నం నిర్మాణంలోనూ బీఆర్ఎస్ పార్టీ భారీ అవినీతికి పాల్పడిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టమొచ్చినట్టు పెంచారని, ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని మండిపడ్డారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలు గుర్తుకు రావాలని, కానీ, దానిని కూడా కేసీఆర్​ తన రాజకీయ స్వార్థానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల చరిత్రే తెలంగాణ చరిత్ర అన్నట్టుగా వ్యవహరిస్తూ అమరుల బలిదానాలను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం గాంధీభవన్​లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారని చెప్పారు. ‘‘అమరవీరుల స్థూపం నిర్మాణానికి 2017 జూన్​17న ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 

డిజైన్, అంచనాల కోసం, పనులను పరిశీలించడానికి 6 శాతం ఫీజు చెల్లించాలని పేర్కొంది. 2018 జూన్​ 28న నిర్మాణం కోసం రూ. 63.75 కోట్లతో టెండర్​ పిలిచారు. ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసింది. కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకుంది. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్​తో కలిశాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్​గా మారింది. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కంపెనీ.. ఆ తర్వాత విజయవాడకు మారింది. కేటీఆర్​కు తేలుకుంట్ల శ్రీధర్ సన్నిహితుడు. కేపీసీ ప్రాజెక్ట్స్​కు చెందిన కామిశెట్టి అనిల్​కుమార్​తో తేలుకుంట్ల శ్రీధర్ వ్యూహాత్మకంగా కేటీఆర్​కు మేలు జరిగేలా చూశారు’’ అని ఆరోపించారు.

మూడుసార్లు నిర్మాణ ఖర్చులను పెంచిన్రు

అమరుల స్మారకం నిర్మాణ అంచనా ఖర్చులను మూడుసార్లు పెంచేశారని రేవంత్​ ఆరోపించారు. ‘‘రూ.63.75 కోట్లతో టెండర్​ పిలిస్తే.. తర్వాత అది రూ.127.5 కోట్లకు పెరిగింది. అది సరిపోదని మళ్లీ రూ.158.85 కోట్లకు పెంచారు. తర్వాత దానిని రూ.179.50 కోట్లు చేశారు. అంత ఖర్చు పెట్టి కట్టిన స్మారకంలో కనీసం అమరుల పేర్లు రాయలేదు. కేవలం అమరవీరులకు జోహార్లు అని పెట్టడం దారుణం. అమరుల స్మారకం శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు.. రాష్ట్రంలో వివిధ పనుల శిలాఫలకాలపై మాత్రం కేసీఆర్​ పేరును ఎందుకు పెట్టాలి?’’ అని ప్రశ్నించారు. చరిత్రను మలినం చేసేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది అమరుల త్యాగాలను కేసీఆర్​ కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. అమరుల స్మారకం అనగానే ఒక శ్రీకాంతాచారి, ఇషాన్​రెడ్డి, కానిస్టేబుల్​ కిష్టయ్య.. వంటి వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలన్నారు. అలాంటి స్మారక స్థూప నిర్మాణాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్​కు తెలంగాణ అమరుల స్మారక నిర్మాణం టెండర్​ను ఇవ్వడం తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం కాదా అని ప్రశ్నించారు.

అసెంబ్లీ సాక్షిగా కేసీఆరే ప్రకటించిన్రు

తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి ప్రశాంత్​ రెడ్డి మీడియాతో అనడం దుర్మార్గమని రేవంత్ మండిపడ్డారు. 2014 జూన్​ 14న అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా కేసీఆరే తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో 1560 మంది చనిపోయారని నిండు సభలో కేసీఆర్​ ప్రకటించారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. ఆ తీర్మానాన్ని కాదని మంత్రులు ఇప్పుడు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. అమరులైన వారిలో కేవలం 500 మంది కుటుంబాలకే ప్రభుత్వం సాయమందించిందన్నారు. మిగిలిన వారి విషయంలో అడ్రస్​లు దొరకలేదంటూ తప్పించుకునేందకు సాకులు చెప్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి అడ్రస్​ దొరకట్లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.

అమరుల కుటుంబాలకు పింఛన్ ఇస్తం

డిసెంబర్​9 లోగా రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే ఏర్పడుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అదే రోజున సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో 1569 మంది అమరుల కుటుంబాలతో సహపంక్తి భోజనాలు చేయిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1,569 మంది అమరుల పేర్లను స్మారకంలో శిలాఫలకం మీద రాయిస్తామని, ఆ వివరాలు చదివాకే స్థూపం వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన అమరుల కుటుంబాలను గుర్తించి ఘనంగా సన్మానిస్తామన్నారు. వారికి నెలకు రూ.25 వేల పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన సమరయోధులు గా గుర్తింపుని స్తామన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్​ విగ్రహం, అమరుల స్మారకం, సచివా లయ నిర్మాణాలపై విజిలెన్స్​తో విచారణ చేయిస్తామని హెచ్చరిం చారు. అవినీతికి పాల్పడిన వారిని చర్లపల్లి జైలుకు పంపుతామన్నారు. మీడియా సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​, అంజన్​ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

తొమ్మిదేండ్లు కడ్తరా?

పది ఎకరాల్లో కట్టించిన ప్రగతిభవన్​ను తొమ్మిది నెలల్లో పూర్తి చేయించిన కేసీఆర్​.. అమరుల స్మారకాన్ని తొమ్మిదేండ్లు సాగదీసి సాగదీసి కట్టారని రేవంత్​ ఆరోపించారు. ఇన్నేండ్లు పడుతుందా అని ప్రశ్నించారు. అమరుల స్మారకం నిర్మాణంలో కేటీఆర్ కమీషన్లు దండుకుంటున్నా కేసీఆర్​కు కనిపించడం లేదా అని నిలదీశారు. స్మారక నిర్మాణంలో వాడిన స్టెయిన్​లెస్ స్టీల్​లోనూ నాణ్యత లేదన్నారు. ఎలివేషన్​ను 8 ఎంఎం స్టెయిన్​లెస్​ స్టీల్​తో కడతామని తొలుత పేర్కొన్నా.. ఆ తర్వాత 4 ఎంఎం పలుచనైన స్టెయిన్​లెస్​ స్టీల్​ను వాడారని చెప్పారు. దీంతో షీట్ల మధ్య చాలా గ్యాప్​లు ఉన్నాయన్నారు. అడవుల్లో మామూలు జనాలు కట్టిన స్థూపాలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. కానీ, నగరం నడిబొడ్డున కట్టిన అమరుల స్థూపంలో ఇప్పటికే సొట్టలు, గ్యాప్​లు కనిపిస్తున్నాయన్నారు. ఈ మొత్తం అవినీతికి కేటీఆర్, ఆయన స్నేహితుడు శ్రీధర్ కారణమన్నారు. కాగా, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని కూడా కేసీ పుల్లయ్య కంపెనీకే ఇచ్చారన్నారు.