కేసీఆర్ ను చెట్టుకు ఉరేసి చంపినా పాపం లేదు : రేవంత్ రెడ్డి

 కేసీఆర్ ను చెట్టుకు ఉరేసి చంపినా పాపం లేదు : రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధరణి వల్ల దోపిడీ జరిగిందని.. సీఎం కేసీఆర్ ను అసెంబ్లీ ప్రాంగణంలోని చెట్టుకు ఉరేసి చంపినా పాపం లేదంటూ విరుచుకుపడ్డారాయన. 2023, జూన్ 14వ తేదీన హైదరాబాద్ గాంధీభవన్ లో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి తాము ఏ మాత్రం భయపడటం లేదన్నారు రేవంత్ రెడ్డి.

ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్ ధరణి దోపిడీ చూస్తే.. అసెంబ్లీ ప్రాంగణంలోని చెట్టుకు ఉరేసి చంపినా పాపం లేదని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో కట్టేసి కొట్టినట్లు కేసీఆర్ ను చేసినా తప్పులేదన్నారు. ధరణి వెనకాల దోపిడీని ప్రజలకు వివరిస్తామన్నారు. 75ఏండ్ల స్వతంత్ర్య దేశంలో ఎప్పుడూ ఇంత దోపిడీ జరగలేదన్నారు రేవంత్ రెడ్డి.

ILFS సంస్థ జాతీయ బ్యాంకులకు 90 వేల కోట్లకుపైగా నిండా ముంచిందని, అలాంటి దివాళ తీసిన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఒప్పందం చేసుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ILFS సంస్థకు ధరణిని కట్టబెట్టారని తెలిపారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ శ్రీధర్ రాజు అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. 

ధరణి పోర్టల్ కోసం 2008లోనే ఒడిశా ప్రభుత్వం టెండర్ పిలిచిందని, తర్వాత ధరణి పోర్టల్ ను ఉపయోగిస్తే... అంతా తప్పుల తడకగా ఉందని కాగ్ రిపోర్టు ఇచ్చిందని రేవంత్ చెప్పారు. ధరణితో నష్టం వచ్చిందని కాగ్ రిపోర్ట్  లో పేర్కొన్నారని వివరించారు. ఒడిశాలోనూ ILFS సంస్థే ధరణిని నిర్వహించిందని, అలాంటి సంస్థతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు. 

ధరణి వచ్చాక అంటే 22 నెలల్లో 50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణికి వస్తున్న డబ్బులన్నీ శ్రీధర్ రాజు అకౌంట్ లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు చెల్లిస్తున్న డబ్బులన్నీ శ్రీధర్ రాజు అకౌంట్ లోకి వెళ్తున్నాయని, ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే చెల్లించిన అమౌంట్ తిరిగి రావడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల తెలంగాణ రాష్ర్ట ప్రజల డేటా ఫిలిప్పిన్ దేశానికి వెళ్తోందని వెల్లడించారు. 

కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్లు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన 25 లక్షల లావాదేవీలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తక్షణమే ధరణిపై సీఐజీ నివేదికను కేంద్ర ప్రభుత్వం అడగాలని డిమాండ్ చేశారు. భారతీయుల డేటాను ఇతర దేశాలకు ఇచ్చినందుకు.. సంబంధిత అధికారులను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కోరారు. ధరణి పోర్టల్ సింపుల్ సాఫ్ట్ వేర్ కాదన్నారు. దోపిడీ చేసేందుకే ధరణి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. 

https://www.youtube.com/watch?v=eq8ZsmPg9yY