ఈడీ వేధిస్తున్నా.. పాదయాత్రకు రాహుల్ నడుంబిగించారు : రేవంత్ రెడ్డి

ఈడీ వేధిస్తున్నా.. పాదయాత్రకు రాహుల్ నడుంబిగించారు   :  రేవంత్ రెడ్డి

సూర్యుడి వెలుగుల నడుమ ఉదయించే కిరణంలా రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ కు స్వాగతం పలికి, ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలిపారు.  దేశంలో ఉన్న  ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటం చేస్తున్నారని, ఇంత అద్భుతమైన పాదయాత్రను ఎవరూ చేయలేరన్నారు. ఈడీ వేధిస్తున్నా కూడా రాహుల్ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి నడుంబిగించారన్నారు.. మోడీ చేస్తున్న  మోసాలను ప్రజలకు వివరించారని తెలిపారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో చాలా స్పూర్తిని నింపిందన్నారు. 

మునుగోడు ఫలితాలపై మాట్లాడిన రేవంత్...  కమ్యూనిస్టుల సహకారంతోనే  టీఆర్ఎస్ గెలిచిందన్నారు. స్వశక్తితో గెలిచే సామర్థ్యాన్ని కేసీఆర్ కోల్పోయారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు నిస్సిగ్గుగా తయారయ్యారని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి మునుగోడు నియోజకవర్గాన్ని దేశంలోనే తాగుడులో ప్రధమస్ధానంలో నిలబెట్టాయని ఆరోపించారు. ఇందులో కాంగ్రెస్ పాత్ర లేదని చెప్పుకోవడానికి తనకు గర్వంగా ఉందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. వారి టార్గెట్ కాంగ్రెస్ ను చంపేయడమేనన్నారు. ఈ ఉపఎన్నికలో ఎలక్షన్ కమిషన్ నిస్సహాయంగా ఉండిపోయిందని ఆరోపించారు.

దేశంలో, రాష్ట్రంలో ఈసీ ఉండాల్సిన అవసరం లేదని, దాన్ని రద్దు చేయాలన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలిచే విధంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు.