ఎవర్ని గెలిపించాలో మునుగోడు ప్రజలకు బాగా తెలుసు

ఎవర్ని గెలిపించాలో మునుగోడు ప్రజలకు బాగా తెలుసు
  • గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకుండు
  • యాదాద్రి జిల్లాలో రోడ్‌షో
  • గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకుండు
  •   గుడిమల్కాపురం నుంచి సర్వేల్ దాకా రేవంత్ రోడ్‌‌షో

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిని కొనేందుకు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు గుంటనక్కల్లా ఎదురుచూశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డబ్బులు పెట్టి ఓటర్లను కొనడమే టీఆర్ఎస్, బీజేపీ పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం నుంచి సర్వేల్ వరకు రేవంత్ రోడ్ షో నిర్వహించారు. తర్వాత సర్వేల్ గ్రామంలో ఆయన మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. జైలు కూడు తిన్న వ్యక్తితో తాము ఉండలేమంటున్నారు. నేనేం తప్పు చేసి జైలుకెళ్లలేదు. పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నందుకే కేసీఆర్ నాపై120 కేసులు పెట్టించి జైలుకు పంపించారు” అని అన్నారు.

ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది..

‘‘ఢిల్లీ నుంచి అమిత్ షా, గజ్వేల్ నుంచి కేసీఆర్ వచ్చారు. మునుగోడు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఓట్లు అడిగే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది. తమ దగ్గర ఉన్న దొంగ సొమ్ముతో ఓటర్లను కొని గెలుస్తామనే అహంకారంతో ఉన్నారు వాళ్లు” అని రేవంత్ ఆరోపించారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, ఎవర్ని గెలిపించాలో వారికి బాగా తెలుసని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు భూములు ఇస్తే  ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణరాయన్ పల్లి, శివన్నగూడెం ప్రాజెక్టుల పేరుతో గుంజుకున్నారని, నిర్వాసితులను ఆగం చేశారని విమర్శించారు. ఇక్కడ ఓట్లడిగే హక్కు తమకే ఉందన్నారు.

కమ్యూనిస్టుల కాళ్లు మొక్కుతుండు

‘‘ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కమ్యూనిస్టుల కాళ్లు మొక్కుతున్నారు. కరీంనగర్, ఖమ్మంలో ఉండే కమ్యూనిస్టు నాయకులు క్షమించినా.. ఇక్కడి కార్యకర్తలు కేసీఆర్‌‌‌‌ను క్షమించడానికి సిద్ధంగా లేరు. దేవరకొండలో కాంగ్రెస్ కష్టపడి సీపీఐ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. టీఆర్ఎస్ పార్టీలోకి లాక్కున్న విషయాన్ని కమ్యూనిస్టు కార్యకర్తలు మర్చిపోలేదన్నారు.