సోనియా లేకపోతే కేసీఆర్, కేటీఆర్ కి పదవులెక్కడివి

సోనియా లేకపోతే కేసీఆర్, కేటీఆర్ కి పదవులెక్కడివి
  •  
  • మంత్రి కేటీఆర్​కు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కౌంటర్​
  • రాష్ట్ర ఏర్పాటులో ఎవరి పాత్ర ఎంతో తేల్చుకుందామని సవాల్​
  • పబ్స్​, డ్రగ్స్​, గంజాయికి కేరాఫ్​గా రాష్ట్రాన్ని మార్చిన్రు
  • మంత్రి పదవిని చెప్పుతో సమానమన్నోళ్లను చెప్పుతో కొట్టాలి
  • రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సర్కారుకు పట్టదా?
  • ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్రంలోరాహుల్​ గాంధీ పర్యటిస్తారని వెల్లడి 

హనుమకొండ, వెలుగు: ‘‘సోనియమ్మ లేకపోతే నీకు, నీ నాయినకు పదవులెక్కడియి?” అని మంత్రి కేటీఆర్​కు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. సోనియా పెట్టిన భిక్షతోనే కేసీఆర్​ ఫ్యామిలీకి పదవులు వచ్చాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ఎన్నో  ఆటంకాలు, ఒడిదొడుకులను ఎదుర్కొని సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చారు.  అలాంటి రాష్ట్రాన్ని ఓ దోపిడీ దొంగ దోచుకుంటున్నడు” అని మండిపడ్డారు. తెలంగాణ సోనియాగాంధీ మానసపుత్రిక అని, కేంద్రం, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి మరీ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. మే ఆరో తేదీన హనుమకొండ ఆర్ట్స్​ కాలేజ్​ గ్రౌండ్​లో నిర్వహించే రైతు సంఘర్షణ సభ కు రాహుల్​ గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం పీసీసీ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ అంజన్​ కుమార్​ ఇతర నేతలతో కలిసి సభా స్థలాన్ని రేవంత్​ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమంలో రేవంత్​రెడ్డి ఎక్కడున్నడని మంత్రి కేటీఆర్​ అంటున్నడు. ఆ సమయంలో నేను ఎక్కడున్ననో మీ అవ్వ.. అయ్యను అడుగు’’ అంటూ సీరియస్​ అయ్యారు. 2009 శాసనసభలో పునర్విభజన సమస్యలు, కృష్ణా, గోదావరి రివర్​ మేనేజ్​ మెంట్​ బోర్డు ఏర్పాటుతో పాటు సీలేరు మేనేజ్​ మెంట్ బోర్డు గురించి మాట్లాడింది తానేనన్నారు. బార్డర్​లోని ఏడు మండలాలను కొల్లగొడతారని కూడా ముందే చెప్పానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర ఎంతో వరంగల్ సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్​కు సవాల్​ విసిరారు. 

కేటీఆర్​ను చెప్పుతో కొట్టాలి

మంత్రి పదవిని చెప్పుతో సమానమన్న కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలని రేవంత్​ అన్నారు. ‘‘దళితులను మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ కు పదవులపై వ్యామోహం లేదా? తెలంగాణ వస్తే కాపలాకుక్కలెక్క ఉంటానని చెప్పి ప్రజలను కుక్కల్లా పీక్కుతింటున్నది వాస్తవం కాదా? వారి ధ్యాసంతా పైసలు, పదవులు, పక్కోడి ఆస్తులమీదే” అని మండిపడ్డారు.

ఏడాదిలో అధికారంలోకి వస్తం

కేసీఆర్​ నిరంకుశత్వంపై పోరాడేందుకు హనుమకొండ ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​లో మే 6న 'రైతు సంఘర్షణ సభ' నిర్వహించనున్నట్లు రేవంత్​ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకోసారి రాష్ట్రంలో రాహుల్​ పర్యటిస్తారని చెప్పారు. పీసీసీ స్టార్ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 40 ఏండ్ల కిందట ఇందిరమ్మ ఇచ్చిన భూములను అధికార పార్టీ లీడర్లు లాక్కుంటున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో డ్రగ్స్​తో విధ్వంసం

రాష్ట్రాన్ని క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్​, గంజాయికి కేరాఫ్​గా ప్రభుత్వం మార్చిందని రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలో రాష్ట్రంలో 6 పబ్స్​ ఉంటే.. ఇప్పుడు 89 పబ్బులకు పర్మిషన్​ ఇచ్చారని దుయ్యబట్టారు.  పబ్బుల్లో 145 మంది దొరికితే వారిపై యాక్షన్​ తీసుకోకపోవడం వెనుక మంత్రి కేటీఆర్​ ఉన్నారని రేవంత్​ ఆరోపించారు. మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాల్లో టీఆర్​ఎస్​ నేతలే ఉంటున్నారన్నారు. రాష్ట్రంలో రైతులను సీఎం కేసీఆర్​ ప్రత్యామ్నాయంగా వరి వైపు ఉసిగొలిపారని, ఆ తరువాత వరి వేస్తే ఉరే అంటూ మోసం చేశారని మండిపడ్డారు. నిజామాబాద్​ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు మూసేస్తే అక్కడి రైతులంతా వరి వైపు వచ్చారన్నారు. రాష్ట్రంలో పసుపు, మొక్కజొన్న, సోయాబీన్​, పత్తి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులంతా వరి వైపు మళ్లారని, ప్రభుత్వ పట్టింపు లేకనే ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “111 జీవో రద్దు.. మోసగాడి మరో మోసం’’ అని రేవంత్ ఆరోపించారు. 111 జీవో పై 2007 జులై 16న తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు స్టే విధించిందని ట్వీట్​ చేశారు.