
హైదరాబాద్, వెలుగు: ఇసుక, మట్టి మాఫియాను మంత్రి శ్రీధర్ బాబు ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు చేసిన ఆరోపణలపై పీసీసీ అధికార ప్రతినిధులు యోగేశ్వర్ రెడ్డి, కమల్ స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు నిజాయతీ, హుందా తనం ప్రజలకు తెలుసని చెప్పారు. రాజకీయ ఉనికి కోసం పుట్ట మధు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీధర్ బాబుపై పుట్ట మధు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం ఇద్దరు నేతలు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పుట్ట మధు ఒక దోపిడీ ముఠా నాయకుడని విమర్శించారు. ఆయన హత్యా రాజకీయాలు అందరికి తెలుసన్నారు. పుట్ట మధు ఓ ఇసుక మాఫియా లీడర్ అని, ఆయన అక్రమాలకు పాల్పడుతున్న అంశాలపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. మంత్రిపై చేసిన నిరాధారమైన కామెంట్లను వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు.