- ఈసీకి పీసీసీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్ కు బీఆర్ఎస్ నేతలు తీవ్ర అంతరాయం కలిగించే రీతిలో వ్యవహరించారని పీసీసీ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి పీసీసీ నేతలు రాజేశ్ కుమార్, వాజిద్ హుస్సేన్, రాఘవేందర్ ఫిర్యాదు చేశారు.
వందలాది మంది పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని కాంగ్రెస్ ఆఫీసుకు సమీపంలో రోడ్డుపై బైఠాయించడం, కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు బూత్ ల వద్ద బీఆర్‌ఎస్ నేతలు ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేందుకు ప్రయత్నించారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
