
హైదరాబాద్, వెలుగు : ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కేసుల పేరిట హింసిస్తున్నదని పీసీసీ నేతలు అన్నారు. ఎప్పుడో మూసేసిన కేసును తిరగదోడి కక్షపూరితంగా సోనియా, రాహుల్‌లను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. సోనియాను ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మోడీ సర్కారును నిలదీస్తున్నందుకు, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నందుకే కేంద్రం తమ నేతలపై కక్ష కట్టిందని విమర్శించారు. దీక్షకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరై సంఘీభావం ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రూ.80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని మోడీ తాకట్టు పెడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర్చవేర్చలేదన్నారు. ‘‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ ఆ విషయం మర్చిపోయి ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారు. దీనిపై సర్కారును నిలదీస్తే సమాధానం చెప్పకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని పల్లెపల్లెకూ తీసుకెళ్తాం” అని వ్యాఖ్యానించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆంధ్రా వాళ్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆంకాక్షలను గాలికి వదిలేసి, టీఆర్ఎస్ నేతలు సంపాదన కోసం ఎగబడ్డారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లేకుండా నిర్మించిన కాంట్రాక్టర్‌ని అరెస్టు చేసి విచారిస్తే వాళ్ల బాగోతాలన్నీ బయటపడతాయన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాను ఇబ్బందిపెట్టడం దారుణమన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ బీజేపీకి ఈడీ అనుబంధ సంస్థలాగా కనిపిస్తోందన్నారు. గాంధీ కుటుంబంపై కేసులు పెడితే భయపడేది లేదనీ, కాంగ్రెస్ కేడర్ నుంచి విప్లవం వస్తుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుతింటున్నాయని మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుందనే కేటీఆర్ కాలు విరిగిందని డ్రామాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. దీక్షలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, జానారెడ్డి, మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ పాల్గొన్నారు. కాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో కొందరు కార్యకర్తలు ఈడీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సత్యగ్రహ దీక్షలు బుధవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.