
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎంపీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీకి రెండు సీట్ల కంటే ఎక్కువ రావని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం అప్రజాస్వామిక చర్య అని ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్లు సమాజంలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేలా ఉన్నాయని మండిపడ్డారు.
మంగళవారం గాంధీ భవన్ లో నిరంజన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి పదవిలో ఉండి ఒక వర్గాన్ని రెచ్చ గొట్టి లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమని తెలిపారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, వీటిని రద్దు చేయటం బీజేపీ తరం కాదని చెప్పారు. ముస్లింలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే హిందువులు మద్దతు ఇస్తారని అనుకోవడం పొరపాటని, దేశంలోని హిందువులు ఒక వర్గాన్ని ఎప్పుడు వ్యతిరేకించరని నిరంజన్ స్పష్టం చేశారు.