
న్యూఢిల్లీ: శాంతి కాలం అనేది ఒక భ్రమ లాంటిదేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి అలజడి లేని సమయంలోకూడా దేశం అలర్ట్‌గానే ఉండాలని ఆయన సూచించారు. ఆకస్మిక పరిణామాలు దేశ ఆర్థిక స్థితిగతులను, ఆపరేషన్ తీరునే మార్చేస్తాయన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో సైన్యం వీరోచితంగా పోరాడిందని మెచ్చుకున్నారు.
సోమవారం (జులై 07) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ కంట్రోలర్ల సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ టైంలో వాడిన మన దేశీయ టెక్నాలజీతో తయారైన పరికరాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు.
విజయం సాధించడంతో మన దేశ రక్షణ రంగాన్ని ప్రపంచం ఇప్పడు కొత్త గౌరవంతో చూస్తోందన్నారు. రక్షణ రంగానికి పెడుతున్న డబ్బును కేవలం ఖర్చులా కాకుండా ఆర్థిక ప్రభావంతో కూడిన పెట్టుబడిగా భావించాలన్నారు. ప్రస్తుతం భారత్ కొత్త ఆయుధీకరణ దశలోకి ప్రవేశిస్తోందని రాజ్‌నాథ్ అన్నారు.