ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
  • యాదాద్రిలో 87.01 శాతం
  • నల్లగొండలో 79.48
  • సూర్యాపేటలో 78.09
  • సోషల్​ మీడియాలో బ్యాలెట్​ పేపర్​

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు:   ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల జాతకం బ్యాలెట్​ బాక్సుల్లో నిక్షిప్తమైంది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌..  సాయంత్రం 5 గంటలకు ముగిసింది.  ఐదులోపు పోలింగ్​ సెంటర్లో ఉన్న వారిని ఓటు వేయడానికి అనుమతించారు.  చౌటుప్పల్​ మున్సిపాలిటీలోని ఓ వార్డులోని బ్యాలెట్​ పేపర్​ ఫొటో సోషల్​ మీడియాలో తిరుగుతోంది.  

మందకొడిగా మొదలై

బుధవారం ఉదయం పోలింగ్​ మందకొడిగా సాగింది. ఉదయం 8 గంటలు దాటినా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పోలింగ్​పై కొంత ప్రభావం చూపించింది. మధ్యాహ్నం 12 తర్వాత పోలింగ్​ఊపందుకుంది. ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు. 

సోషల్​ మీడియాలో బ్యాలెట్​

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు బ్యాలెట్​పై స్వస్తిక్​ ముద్ర వేసిన తర్వాత వెంట తీసుకెళ్లిన ఫోన్​లో ఫొటో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఆ పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారి పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఎన్నికల కమిషన్ సీరియస్ గా పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఓటర్లు ఫోన్లు తీసుకెళ్లి ఫొటోలు తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం సంచలనం కలిగిస్తోంది. 

యాదాద్రిలో తగ్గిన పోలింగ్​

యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ గతం కంటే పోలింగ్​ తక్కువగా నమోదైంది.  గత ఎన్నికల్లో 88.32 శాతం పోలింగ్​నమోదైంది.  జిల్లాలో 104 వార్డులు ఉండగా రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 102 వార్డుల్లో1,30,192 ఓటర్లు ఉన్నారు. 1,13,395 మంది ఓటు  హక్కు వినియోగించుకోగా 87.01 శాతం పోలింగ్​ నమోదైంది. ఆరు మున్సిపాలిటీలో గతంలో మాధిరిగానే ఈసారి కూడా చౌటుప్పల్​ పోలింగ్​ శాతం ఎక్కువగా నమోదైంది. భువనగిరిలో 82.93 శాతం నమోదైంది. 

సూర్యాపేటలో..

సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలున్నాయి. 137 వార్డుల్లో 2,19,972 ఓటర్లున్నారు. వీరిలో 1,75,759 మంది (79.90 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుమలగిరిలో ఎక్కువగా 88.36 శాతం నమోదు కాగా కోదాడలో 77.05 శాతం నమోదైంది. 

నల్లగొండలో..

నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పోరేషన్​, ఆరు మున్సిపాలిటీలున్నాయి. 161 వార్డుల్లో (ఒక వార్డు ఏకగ్రీవమైంది)3,07,992 ఓటర్లున్నారు. వీరిలో 2,40,514(78.09 శాతం) మంది ఓటర్లు ఓటు  హక్కు వినియోగించుకున్నారు. చండూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 91.52 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా నందికొండలో 59.68 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పోలింగ్​ సెంటర్ల నుంచి బ్యాలెట బాక్సులు కట్టుదిట్టమైన భద్రత మధ్య  స్టాంగ్​ రూములకు చేరుకున్నాయి.  శుక్రవారం కౌంటింగ్​ నిర్వహిస్తారు.