- 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతం
- అక్కడక్కడ ఓటర్లకు డబ్బుల పంపిణీ గొడవలు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డుల్లో దాదాపు 1,072 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 3,35,244 మంది ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన ఎలక్షన్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 80.64 శాతం ఓటింగ్ నమోదైంది. చివరగా బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూములకు తరలించారు.
ఓటింగ్., పైసల పంపిణీ., ఫైటింగ్..
మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం నుంచే ఓవైపు పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు పలుచోట్ల బీఆర్‍ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులు, స్థానికులకు దొరికిపోయారు. నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి 22వ వార్డు తదితర మున్సిపాలిటీల్లో ఈ ఘటనలు జరిగాయి. వర్ధన్నపేటలో పోలీసులు బీఆర్‍ఎస్ కి మద్దతుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఇంకో వార్డువద్ద బీజేపీ నేతలు ఇదే తరహాలో సీఐ హరికృష్ణతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. వర్ధన్నపేట డీసీ తండా వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పై స్థానిక ఓటర్లు సీరియస్ అయ్యారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వం తమ తండాలను మున్సిపాలిటీలో చేర్చి అభివృద్ధిని మరిచిందని ఫైర్ అయ్యారు. 5వ వార్డులో విధుల్లో ఉన్న ఏపీవో మధుసూదన్‍కు ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. జనగామలోని పలు వార్డుల వద్ద ఓటుకు నోటు పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలపై మహిళ ఓటర్లు సీరియస్ అయ్యారు.
