- 2023 (47.58%) కన్నా ఒక శాతం ఎక్కువ
- సాయంత్రం 6 గంటలకూ క్యూలైన్లో ఓటర్లు
- ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగే చాన్స్
- ఎంత అవగాహన కల్పించినా కదలని ఓటర్లు
- చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
- 14న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు:చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు నెల రోజులకుపైగా సాగిన హోరాహోరీ ప్రచారం, ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా-? నేనా? అన్నట్టుగా సాగిన పోరు తర్వాత మంగళవారం జరిగిన పోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల అధికారులు సాయంత్రం 6 గంటల వరకు అధికారికంగా 48.49 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రకటించారు.
ఇది 2023 (47.58 శాతం) కన్నా ఒక శాతం మాత్రమే ఎక్కువ. కానీ సాయంత్రం 6 గంటలకు కూడా క్యూలైన్లలో ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల పోలింగ్ శాతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి తక్కువ అంటే 2 లక్షలలోపే ఓటింగ్‌లో పాల్గొన్నట్లు స్పష్టమవుతోంది.
అధికారులు ఎంత అవగాహన కల్పించినా ఓటేసేందుకు జనం రాకపోవడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పోలింగ్ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధంలేని వారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా, ఓటింగ్ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంపై కాంగ్రెస్ కంప్లయింట్ చేసింది.
ఉదయం నుంచి ఓటింగ్ ఇలా
పోలింగ్ సరళిని పరిశీలిస్తే, ఉదయం 9 గంటలకు 10.02 శాతంతో ప్రారంభమైన ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 11 గంటల సమయానికి 20.76 శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 31.94 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 40.20 శాతం, సాయంత్రం 5 గంటలకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. చివరి గంటలో స్వల్పంగా ఓటింగ్ వేగం పెరిగి, 6 గంటల సమయానికి 48.49 శాతంతో పోలింగ్ ముగిసింది. ఇక్కడ 2023 ఎన్నికల్లో 47.58 శాతం, 2018లో 45.59 శాతం ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో బస్తీ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఉద్యోగస్తులు ఓటు వేయడానికి బద్ధకించినట్లు పోలింగ్ పర్సంటేజీతో స్పష్టమవుతోంది. అయితే, జూబ్లీహిల్స్ లో పెరిగిన ఒక ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందనే విశ్లేషణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సాధారణంగా పెరిగిన పోలింగ్ శాతాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా పరిగణించడం రివాజు. కానీ జూబ్లీహిల్స్ బైపోల్‌లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేస్తున్నాయి. 2014లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 50.18 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాత ఎప్పుడూ ఆ మార్క్‌ను దాటలేదు.
పోటీలో 58 మంది.. టఫ్ ఫైట్ ఇద్దరి మధ్యే
ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది నిలబడినప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్అభ్యర్థుల మధ్యే కొనసాగింది. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బరిలో నిలవగా, బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. అధికారపక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు ప్రచారాన్ని హీటెక్కించాయి. ఈ ఎన్నికకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పార్టీల అగ్రనాయకులంతా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. బస్తీలు, కాలనీల్లో పార్టీల కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఎప్పటికప్పుడు పోలింగ్ నమోదు
ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి ఈసీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గ పరిధిలో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదనంగా, సుమారు139 డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచి భద్రతా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించారు.
అక్కడక్కడా స్వల్పంగా చోటుచేసుకున్న చిన్న చిన్న ఉద్రిక్తతలను పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అంతేకాకుండా, పోలింగ్ సరళిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఈసీ ప్రత్యేక యాప్‌ను ఉపయోగించింది. ప్రిసైడింగ్ అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేశారు. ఈ ఉపఎన్నికలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి పార్టీల నేతలు పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇరుకైన రహదారులు ఉండే బస్తీలు, నివాస స్థలాలకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో.. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను తమ వాహనాల్లో తరలించడానికి పార్టీలు పోటీ పడ్డాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు తమ తమ డివిజన్లలో వందల సంఖ్యలో ఆటోలను, ఇతర వాహనాలను ముందే బుక్ చేసుకున్నారు. మరోవైపు, పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్ల సెల్‌ఫోన్లను అనుమతించకపోవడంతో, వాటిని డిపాజిట్ చేయడానికి కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడక్కడ కొన్ని ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. సాయంత్రం కొద్దిసేపైతే ఎన్నికలు ముగుస్తాయనగా, దొంగ ఓట్లు వేస్తున్నారని యూసుఫ్‌గూడ మహబూబా ఫంక్షన్ హాల్ లో ఉన్న కళాకారులపై మాగంటి సునీత అనుచరులు దాడి చేశారు. అయితే, తాము నెలరోజులుగా ఇక్కడే ఉంటున్నామని కళాకారులు వాపోయారు. తర్వాత యూసుఫ్‌గూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు బీఆర్ఎస్అభ్యర్థి మాగంటి సునీత, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్‌నేతలు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించగా కౌశిక్ రెడ్డి తిరగబడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న జాయింట్ సీపీ జోయల్డేవిస్పై చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, అభ్యర్థి సునీతను ఇంటికి పంపించారు.
మధ్యాహ్నం కృష్ణానగర్ లోని అమరావతి స్కూల్ 238 పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోందంటూ మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది.
బోరబండలో నాన్ లోకల్స్వచ్చి పోలింగ్‌కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని ఉదయం కాంగ్రెస్ కార్పొరేటర్ ఫసియుద్దీన్ ఆరోపించడం, బీఆర్ఎస్ లీడర్లు అడ్డు తగలడం కూడా ఘర్షణకు దారి తీసింది. రహ్మత్నగర్డివిజన్పీజేఆర్ చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుగుతూ కనిపించగా, వెళ్లిపోవాలని ఆయనను డీసీపీ శ్రీనివాస్ ఆదేశించారు. షేక్‌పేట డివిజన్ అపెక్స్ హైస్కూల్ పోలింగ్‌కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం నియోజకవర్గంలో కారులో తిరుగుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లగొట్టారు.
వీ6 సర్వేలో 10% లీడ్..
‘వీ6 వెలుగు’ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 50-55%, బీఆర్‌ఎస్‌కు 40-45%, బీజేపీకి 7-8% ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ 10 శాతం ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
