రైతు ప్రభుత్వమంటే భూములు గుంజుకోవడమా? : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

రైతు ప్రభుత్వమంటే భూములు గుంజుకోవడమా? : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

కోహెడ(బెజ్జంకి), వెలుగు: రైతు ప్రభుత్వం అంటే రైతుల భూములు గుంజుకోవడమేనా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ ప్రశ్నించారు. రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి, గుగ్గిళ్ల, తోటపల్లి, లక్ష్మీపూర్, గూడెం గ్రామాల్లో పర్యటించారు. తోటపల్లిలో ప్రవీణ్​కుమార్ ​మాట్లాడుతూ.. తోటపల్లి రిజర్వాయర్ పేరుతో 2007లో గుంజుకున్న 1600 ఎకరాల భూములను తిరిగి ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కావేరి సీడ్స్ కంపెనీకి భూమి కేటాయించిన ప్రభుత్వం, రిజర్వాయర్​ కోసం సేకరించిన భూములను ఎందుకు తిరిగివ్వడం లేదని నిలదీశారు. అసైన్డ్​ భూములను అధికార పార్టీ లీడర్లు పట్టాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలు కమ్యూనిటీ హాళ్లలో ఉంటున్న సంగతి స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును సీఎం కేసీఆర్​దేశ వ్యాప్తంగా తిరిగేందుకు ఖర్చు చేయనున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ముంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్​ చేశారు. మంత్రి హరీశ్​రావు ఊరిలో ఏర్పాటు చేసిన బీఎస్పీ జెండా గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. జెండాలు కూల్చితే త్వరలోనే మీ గడీలు కూలుస్తామని హెచ్చరించారు. ఊళ్లలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వని వారు, తమ అధికారం కోసం సెక్రటేరియట్​వద్ద ఏర్పాటు చేస్తామంటున్నారన్నారు. బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిరుపేదలకు ఎకరం భూమి, 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిశాని రామచంద్రం, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మహిళా కన్వీనర్ సమలత,  పాల్గొన్నారు.