- గుమ్మడవల్లి బాధితులను ఆదుకుంటాం
- 6 గేట్లతో 80 వేల క్యూసెక్కులు నిల్వ చేసేట్లు ప్రాజెక్టు నిర్మిస్తాం
- నీటిపారుదల శాఖ పనితీరు బాగాలేదు
- ప్రాజెక్టును విజిట్ చేసిన మంత్రి తుమ్మల
అశ్వారావుపేట, వెలుగు: పెద్దవాగు ప్రాజెక్టు కెపాసిటీకి మించి వరద వస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించి గేట్లు ఎత్తకపోవడం వల్లే ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. సరైన టైంలో గేట్లు ఎత్తి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణులు చెప్పారని అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టును ఆయన సందర్శించారు.
గుమ్మడవల్లిలో వరద బాధితుల ఇండ్లకు వెళ్లి మాట్లాడారు. పశువులు, మేకలతో పాటు ఇండ్లలో సామగ్రి కొట్టుకుపోయాయని, పొలాలు నాశనమయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. తర్వాత గుమ్మడవల్లి బీసీ గురుకుల జూనియర్కాలేజీలో అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని తెలుసుకొని తల్లడిల్లిపోయానని, గంట గంటకూ అధికారులను అలర్ట్ చేశానన్నారు.
అధికారులు టైంకు వస్తే కష్టంలో ఉన్న ప్రజలను ఏ విధంగా కాపాడవచ్చో ఎస్పీ రోహిత్ రాజు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ నిరూపించారని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి రెండు హెలికాప్టర్లను తీసుకువచ్చి వరదలో చిక్కుకుపోయిన 30 మందిని కాపాడినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామన్నారు.
పెద్దవాగు ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రాజెక్టు అని గోదావరి రివర్ కంట్రోల్ బోర్డు పరిధిలో ఉంటుందన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం 80 శాతం, తెలంగాణ ప్రభుత్వం 20 శాతం పైసలు ఇవ్వకపోవడం వల్ల మెయింటినెన్స్ సరిగ్గా చేయలేదన్న ఆరోపణలున్నాయన్నారు. భవిష్యత్లో మళ్లీ ఇక్కడ ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను తీసుకుంటున్నాన్నారు. వచ్చే సీజన్ కల్లా ఎంత వరద వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్ చేయించి గోదావరి రివర్ కంట్రోల్ బోర్డుతో ఎస్టిమేషన్ వేయిస్తానన్నారు.
ఆరు గేట్లతో 80 వేల క్యూసెక్కుల నీటిని నిల్వ చేసేట్టు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఐటీడీఏ పీవో రాహుల్, ఐబీ సీఈ ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఐబీ ఎస్ఈ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, ఐబీ ఈఈ సురేశ్ కుమార్, డీపీవో చంద్రమౌళి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ బాబురావు, ఆర్టికల్చర్ ఆఫీసర్ సూర్యనారాయణ, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్ఈ బికం సింగ్, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ, లీడర్లు ఆలపాటి ప్రసాద్, చెన్నకేశవరావు, సత్యనారాయణ చౌదరి, కొయ్యల అచ్యుతరావు, కె.వి పాల్గొన్నారు.