పెద్దపల్లి  బీఆర్​ఎస్​లో కొత్త చిక్కులు సిట్టింగ్​లు వర్సెస్​ ఆశావహులు 

పెద్దపల్లి  బీఆర్​ఎస్​లో కొత్త చిక్కులు సిట్టింగ్​లు వర్సెస్​ ఆశావహులు 
  •     పోటాపోటీ  కార్యక్రమాలతో క్యాడర్​ ఆందోళన
  •     అధిష్టానం ఆశీస్సులున్నాయంటున్న ఆశావహులు
  •     సిట్టింగ్ లకు తలనొప్పి 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లోని బీఆర్​ఎస్ పార్టీలో పరిస్థితి యాస్పిరెంట్లు వర్సెస్​ సిట్టింగులుగా మారిపోయింది. హైకమాండ్​  ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జిల్లాకు ఓ ఇంచార్జిని నియమించింది.  ఇన్​చార్జిని కలుపుకొని  సిట్టింగ్​ ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సమ్మేళనాలకు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న నాయకులు హాజరు కావడం లేదు.  గతంలో మాదిరిగానే వారి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం మొదటి నుంచి సిట్టింగులకు రుచించడం లేదు.  ఆత్మీయ సమ్మేళన వేదికల మీద డైరక్టుగా సిట్టింగులు మొర పెట్టుకుంటున్నారు. పార్టీ లైన్​ తప్పవద్దని, సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రాన గెలవరని అది చూసి అధిష్టానం టిక్కెట్​ ఇవ్వదని సూచిస్తున్నారు.

యాస్సిరెంట్లు మాత్రం తమకు 

హైకమాండ్​ ఆశీస్సులున్నాయని, పై వారి సూచనతోనే తాము సేవా  కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.  మరోవైపు బీఆర్​ఎస్​ హైకమాండ్​ సిట్టింగులపై సర్వేలు చేయిస్తుండటంతో యాస్పిరెంట్లలో ఆశలు బలపడుతున్నాయి. ఇంతా జరుగుతున్నా హైకమాండ్​ మాత్రం రెస్పాండ్​ కాకుండా సైలెంట్​గా పరిశీలిస్తుండటంతో సిట్టింగులలో భయం 
పెరిగిపోతోంది.  క్యాడర్​ మాత్రం కన్​ఫ్యూజ్​ అయితుండ్రు.

అదే కథ... 

రామగుండంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే చందర్​ సీటుకు ఎసరు పెట్టే విధంగా జడ్పీటీసీ కందుల సంధ్యారాణి  డైరెక్ట్​ ఎటాక్​ చేస్తున్నారు.   పోలీసు హౌజింగ్​ బోర్డు చైర్మన్​ కోలేటి దామోదర్​ సామాజిక సమీకరణాలను ముందుకు తీసుకెళ్తూ  సైలెంట్​గా పావులు కదుపుతున్నారు.  రామగుండం నియోజకవర్గం మొదట ఎస్సీ రిజర్వుడ్​గా ఉండేది. ఆ తర్వాత జనరల్​ సీటుగా మారింది.  ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి ఏ ఒక్క అగ్రవర్ణ నాయకుడు ప్రాతినిధ్యం వహించ లేదు. జనరల్​గా మారిన తర్వాత బీసీ వర్గానికి చెందిన సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్​లే గెలిచారు. అగ్రవర్ణాలకు ఈ సారి రామగుండం టికెట్​ ఇచ్చేలా హైకమాండ్​పై ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే బీఆర్​ఎస్ నుంచి కోలేటి దామోదర్​ బరిలో నిలిచే ఛాన్స్​ ఎక్కువగా కనిపిస్తోంది. మంథని నుంచి 2018లో బీఆర్​ఎస్​ నుంచి పుట్ట మధు ఓడిపోయినప్పటికీ ఆయనకు జడ్పీ చైర్మన్​గా అవకాశం ఇచ్చారు.  

మంథని నియోజకవర్గ ఇన్​చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనకు చల్లా నారాయణ రెడ్డి రూపంలో సమస్య వచ్చింది.  పుట్ట మధుకు పోటీగా చల్లా నారాయణరెడ్డి ప్రజల్లో తిరుగడంతో పాటు, బీఆర్ఎస్​ సీనియర్​ నాయకులతో నిత్యం టచ్​లో ఉంటున్నారు. ఇటీవల భూపాలపల్లిలో జరిగిన బీఆర్​ఎస్​ సభలలో కూడా చల్లాకు లభించిన ఇంపార్టెన్స్​తో అనుమానాలు బలపడుతున్నాయి. దాసరి మనోహర్​రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు ఎన్నికల్లో  బీఆర్ఎస్ నుంచి మనోహర్​రెడ్డికి రెబల్స్​ గొడవ లేదు. 2023 ఎన్నికలు మాత్రం ఆయనకు కత్తిమీద సామయ్యేట్లున్నయి. పెద్దపల్లి నుంచి భానుప్రసాదరావు పోటీలో ఉంటాడేమో అనుమానాలు ఉండేవి. కానీ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ప్రభుత్వ చీప్​ విఫ్​గా హైకమాండ్​ నియమించింది. ఎమ్మెల్యే దాసరి ఎమ్మెల్సీ భానుప్రసాదరావుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దీంతో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ' నేను పెద్దపల్లి నుంచి పోటీలో లేను'  అని చెప్పారు. కానీ  హైకమాండ్​ ఎవరికి టికెట్​ ఇస్తే వారి గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. దీంతో మనోహర్​రెడ్డితో పాటు ఆయన అనుచరులు డైలామాలో పడిపోయారు. పెద్దపల్లి నుంచి నల్ల మనోహర్​రెడ్డి, బొద్దుల లక్ష్మన్, పెంట రాజేశ్​​ సీరియస్​గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  ఈద శంకర్​రెడ్డి, చిరుమల్ల రాకేశ్​ కూడా ఇంటర్నల్​గా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. పెంట రాజేశ్​ రామగుండం ఎమ్మెల్యే చందర్​కు దగ్గర చుట్టం, జిల్లాకు చెందిన ఓ మంత్రికి అత్యంత సన్నిహితుడు, ఆ మంత్రి ఆశీస్సులతోనే నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎమ్మెల్యే దాసరి కూడా గతంలో హైకమాండ్​కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  

కంట్రోల్​ చేయండి ప్లీజ్​..

పెద్దపల్లి, రామగుండం, మంథని బీఆర్​ఎస్​ నుంచి టికెట్​ ఆశిస్తున్న ఆశవహులను కంట్రోల్​ చేయాలని ఎమ్మెల్యేలు  కోరుతున్నారు. దాసరి మనోహర్​రెడ్డి, కోరుకంటి చందర్, మంథని బీఆర్​ఎస్​ నియోజకవర్గం ఇంఛార్జి పుట్ట మధు జిల్లా మంత్రులతో పాటు హైకమాండ్​ను వేడుకుంటున్నారు.  యాస్పిరెంట్ల కారణంగా పార్టీకి డ్యామేజ్​ జరుగుతోందని,  సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​చార్జిలను విమర్శించడం ద్వారా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. అలాంటి వారిని అదుపులో పెట్టాలని దాసరి, కోరుకంటి, పుట్టలు వేదిక పైనే మంత్రి గంగులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి గంగుల మాత్రం ఎవరినీ నొప్పించకుండా మరోసారి బీఆర్​ఎస్​ పార్టీని అధికారంలోకి తెచ్చేలా క్యాడర్​ కష్టపడాలని సూచించారు.