సింగరేణి కార్మికుల పెన్షన్ 10 వేలకు పెంచాలి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి కార్మికుల పెన్షన్ 10 వేలకు పెంచాలి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  • లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
  •     సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ 
  •     అరకొర పింఛన్లతో కార్మికులు అవస్థలు పడుతున్నరు
  •     కాకా 30 ఏండ్ల కింద ప్రవేశపెట్టిన పెన్షన్లే ప్రస్తుతమూ ఉన్నాయని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:  సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్​ను కనీసం రూ.10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం లోక్​సభలో సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఇబ్బందులను గత సెషన్ లోనూ లోక్ సభ దృష్టికి తెచ్చినట్లు గుర్తుచేశారు. ‘గొప్ప ఆలోచనతో కార్మికులకు మేలు చేసేలా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కాకా వెంకట స్వామి సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చారు. దీన్ని ప్రారంభించి 30 నుంచి 35 ఏండ్లు పూర్తయినా.. ఈ పెన్షన్ స్కీంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దశాబ్దాలు గడిచినా పెన్షన్ సవరణ జరగకపోవడం దురదృష్టకరం. కాకా ప్రవేశపెట్టిన రూ.500, 1000 పెన్షన్ మాత్రమే ఇప్పటికీ అమలవుతున్నది’ అని అన్నారు. 

హామీ ఇచ్చి అమలు చేయలే..

గత సెషన్​లో సింగరేణి కార్మికులకు పెన్షన్ హామీ ఇచ్చారని వంశీకృష్ణ గుర్తు చేశారు. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయన్నారు.టన్ను బొగ్గు ఉత్పతికి రూ.20 పెంచేలా కోల్ మైన్స్ పెన్షన్ స్కీం(సీఎంపీఎస్) ట్రస్ట్ బోర్డుకు జమ చేస్తానని సింగరేణి సంస్థ ప్రకటించిందన్నారు. కానీ దురదృష్టవశాత్తు సవరించిన ఈ నిర్ణయం ఇప్పటికీ అమలుకావడం లేదన్నారు. అందువల్ల సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆవేదనను మరోసారి సభ దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని రూ.500 నుంచి రూ.10 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రిటైర్డ్ కార్మికులు వేసిన కేసు కూడా కోర్టులో కొనసాగుతున్నదని సభ దృష్టికి తెచ్చారు.