
బెల్లంపల్లి రూరల్, వెలుగు: గత 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పించాలని, నిరుపేద గిరిజన రైతులకు భూములు ఇవ్వాలని సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను నెన్నెల మండలంలోని కోణంపేట, బోగంపల్లి, నెన్నెల గ్రామాలకు చెందిన గిరిజనులు కలిసి విన్నవించారు. పోడు భూముల సర్వే చేయించి పట్టాలు అందేలా చూడాలని కోరారు. సీఎం గిరివికాస పథకం నుంచి బోర్లు మంజూరైనా కరెంట్సౌకర్యం కల్పించలేదన్నారు. బీటీ రోడ్డు వేయాలని, సోలార్పంపుసెట్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో మాట్లాడారు. అర్హులైన గిరిజన, దళిత నిరుపేద రైతులకు భూములు ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కోల్‌బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ లీడర్ అంకం నరేశ్ కొడుకు సాయిఅఖిల్–హిమేశ్వరి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుర్మ సురేందర్, కాంగ్రెస్ కార్యకర్త సుగుణాకర్ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఇటీవల వారితండ్రి రామయ్య చనిపోగా విషయం తెలుసుకున్న ఎంపీ గద్దెరాగడిలోని వారి కుటుంబాన్ని కలిశారు. అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంపీ వెంట కాంగ్రెస్, అనుబంధ సంఘాల లీడర్లున్నారు.