
పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఓ యువ నేతకార్మికుడు తన ఆవేదనను, తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన స్థానిక TRS నాయకుడు.. తమ ఇంటి ఇరుగుపొరుగువారితో కలిసి.. చేనేత పని చేసుకోకుండా ఆపుతూ వేధిస్తున్నారని యువకుడు తుమ్మ అజయ్ ఆరోపించాడు. తాము ధర్మపురి ఎమ్మెల్యే మనుషులమని బెదిరిస్తున్నారని చెప్పాడు.
మూడు రోజుల కిందటే బాధిత కుటుంబసభ్యులు అధికారులను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు చెప్పారు. ఐతే.. సమస్య పరిష్కారం కాకపోగా.. వీరిపై ప్రజావాణిలో ఫిర్యాదు నమోదైంది. ఇంట్లో సాంచెల నుంచి వచ్చే శబ్దం వల్ల తమకు ఇబ్బంది అవుతోందని ఓ కుటుంబం ఫిర్యాదుచేసింది. దీంతో.. సోమవారం రోజున అజయ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
వీడియోలో అజయ్ ఏం చెప్పాడంటే.. “మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామం. మా నాన్న పేరు తుమ్మ తిరుపతి. గత 20 ఏళ్లుగా మహారాష్ట్రలోని భీవండిలో చేనేత పని చేసుకుంటున్నాం. భార్యాపిల్లలను వదిలిపెట్టి ఎన్నిరోజులు అక్కడ పని చేసుకుంటావ్… తెలంగాణ ప్రభుత్వం ఎవరి వృత్తి వారు చేసుకోవాలని చెబుతోంది అని కొందరు స్థానికులు మాకు చెప్పారు. మా నాన్న రూ.6లక్షలు అప్పు తేవడంతో.. ఇంట్లోనే 2 సాంచెలు వేసుకున్నాం. ఐతే… ఇంటిపక్కనున్న వారితో కలిసి స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఒకరు 3 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేం పనిచేసుకుంటుంటే సౌండ్ వస్తోందనే ఉద్దేశంతో సాంచెలు మొదలుపెట్టనీయడం లేదు. వాళ్ల పలుకుబడితో మమ్మల్ని అణచేస్తామని బెదిరిస్తున్నారు. మేం మెషీన్లు మొదలుపెడితే.. కిరోసిన్ పోసి తగలబెడతారట. ఆర్థికంగా, మానసికంగా మేం చాలా ఇబ్బందిపడుతున్నాం. మేం బయటకు వెళ్లినా మాకు రక్షణ లేకుండా పోయింది. ఒక్కరం బయటకు వెళ్తే నలుగురు వెనకాల వస్తున్నారు. ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయొద్దు. పేదోళ్లను ఆదుకోండి. మా అమ్మా,నాన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. మా కులవృత్తిని మేం చేసుకుంటే మమ్మల్ని, మా మెషీన్లను తగలబెడతారనడం కరెక్టేనా. మా కులవృత్తి ఆపితే.. మేం నంది మేడారం చెరువులో దూకి చనిపోవుడే తప్ప వేరే దారిలేదు. ఏ చేనేత కార్మికుడికీ ఈ పరిస్థితి రాకుండా చూడండి” అని ఆ కార్మికుడు తన ఆవేదనను వీడియో రూపంలో తెలియజేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.