
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తానాబాద్ టౌన్ శివారులోని శాస్త్రినగర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్ అదుపుతప్పి ముందువెళ్లే లారీని, ఆ తర్వాత చెట్టును ఢీకొంది. కంటైనర్ క్యాబిన్ లో ఇరుక్కొని క్లీనర్ షౌకిన్ (36) చనిపోగా.. డ్రైవర్ మొహబద్ తీవ్రంగా గాయపడ్డాడు. షౌకిన్ డెడ్ బాడీని సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కాగా.. మృతుడు రాజస్థాన్ లోని భాస్కర్ముఖికి చెందినవాడు. కొత్తగూడెం నుంచి ఢిల్లీకి మిర్చీ లోడ్ తో వెళ్లే కంటైనర్ ను క్లీనర్ షౌకిన్ నడుపుతుండగా ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
బైక్ పై వెళ్తుండగా ఆర్ఎంపీ ..
జిల్లాలోని ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ కు చెందిన ఆర్ఎంపీ శివపల్లి రవీందర్(58), గురువారం రాత్రి బైక్ పై అయితరాజ్ పల్లికి వెళ్లి.. తన బంధువు రాజయ్యను ఎక్కించుకొని గర్రెపల్లికి వెళ్తున్నాడు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ శివారులో ఎదురుగా వచ్చే బైక్ ను ఢీకొనడంతో రవీందర్, రాజయ్య తీవ్రంగా గాయపడ్డారు.
సుల్తానాబా ద్ ఆస్పత్రికి, అటునుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే రవీందర్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య సత్యలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.