మంచిర్యాలలో మూడో యూనిట్కు ముహూర్తం!.. ఎస్టీపీపీలో మరో మెగా పవర్ ప్లాంట్

మంచిర్యాలలో మూడో యూనిట్కు ముహూర్తం!.. ఎస్టీపీపీలో మరో మెగా పవర్ ప్లాంట్
  • ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపనకు ఏర్పాట్లు 
  • తాజాగా కూలింగ్​ టవర్స్, రైల్వే వ్యాగన్ ట్రిప్లర్​ నిర్మాణ ప్రాంతాల్లో భూమి పూజ
  • రూ.6,700 కోట్లతో 800 మెగావాట్ల ప్లాంట్ ​నిర్మించనున్న బీహెచ్ఈఎల్​ 
  • మూడో యూనిట్ కోసం రాష్ట్ర మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక చొరవ ​ ​
  • సింగరేణికి ఆదాయంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

కోల్​బెల్ట్​/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్(ఎస్టీపీపీ) మూడో యూనిట్ కు మరో అడుగు పడింది. గురువారం ప్లాంట్ కూలింగ్​ టవర్స్, రైల్వే వ్యాగన్​ ట్రిప్లర్​ను నిర్మించే స్థలాల్లో సింగరేణి డైరెక్టర్​(ఈఎం) తిరుమల్​రావు భూమి పూజ చేశారు. దీంతో మూడో యూనిట్​ నిర్మాణ పనులు  స్పీడ్ అందుకున్నాయి. 

ఫిబ్రవరిలో సీఎం రేవంత్​రెడ్డి ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని ఇప్పటికే రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి స్పష్టత ఇచ్చారు. కొద్దిరోజులుగా కలెక్టర్, సింగ రేణి ఉన్నతాధికారులతో కలిసి జైపూర్​ఎస్టీపీపీని సందర్శిస్తున్నారు. మూడో యూనిట్ నిర్మాణానికి​ కావాల్సిన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

ఇప్పటికే పైలాన్​ నిర్మించారు. రూ.6,700 కోట్లతో ఏర్పాటయ్యే మూడో యూనిట్ కాంట్రాక్ట్ ను   భారత్​హెవీ ఎలక్ర్టికల్స్​ లిమిటెడ్​(భెల్) దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి సింగరేణి 800 మెగావాట్ల సూపర్ ​క్రిటికల్​ థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్​ను ఎస్టీపీపీ నిర్మించనుంది. 

ఎన్టీపీసీ నిర్మాణంలో కాకా కుటుంబం కృషి

మాజీ పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన తనయుడు అప్పటి కార్మికశాఖ మంత్రి గడ్డం వినోద్​..  సింగరేణి థర్మల్ ​పవర్​ ప్లాంట్​ఏర్పాటుకు  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలను కలిసి ఒప్పించారు. ఫలితంగా 2005లో కాంగ్రెస్ ​హయాంలోనే  ఎస్టీపీపీ నిర్మాణం షురూ అయింది.  రూ.7,573 కోట్ల అంచనాతో 600 మెగావాట్లతో   రెండు యూనిట్లు కలిపి మొత్తం1,200 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ను నిర్మించారు. 

ప్రస్తుతం ఎన్టీపీసీ ఉత్పత్తి చేసే విద్యుత్ లో160 మెగావాట్లు మాత్రమే సొంతానికి వాడుకుంటూ, మిగతా పవర్ 1,040 మెగావాట్లను జెన్​కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతోంది.  అదేవిధంగా మూడో యూనిట్ ప్లాంట్ కోసం కాకా రెండో తనయుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్ ​ వెంకట స్వామి చొరవతో సుమారు1,883 ఎకరాలను సేకరించారు. దీంతో మరో 600 మెగావాట్ల యూనిట్​ నిర్మాణానికి 2015 మార్చిలో అప్పటి  సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అయితే.. కేంద్రం పర్యావరణానికి సంబంధించిన అభ్యంతరాలు తెలపడంతో టెండర్ల దశలోనే ఆగిపోయింది. 

దీంతో మూడో యూనిట్ నిర్మాణంపై పై సందేహాలు తలెత్తాయి. కాగా.. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవ తీసుకుని 800 మెగావాట్లతో ప్లాంటు నిర్మించేందుకు అసెంబ్లీలో ప్రస్తావించారు.  

అనంతరం సీఎం, డిప్యూటి సీఎంను ఒప్పించారు.  దీంతో సింగరేణి మళ్లీ టెండర్లు పిలవగా రూ.6,700 కోట్లతో నిర్మించేందుకు 2024  ఫిబ్రవరిలో​ బీహెచ్ఈఎల్​(భెల్​) సంస్థ దక్కించుకుంది. డిజైన్​,ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్​, సివిల్ ​వర్క్స్​ పనులు సదరు సంస్థ చేపట్టనుంది. 

అదనపు ఆదాయం.. యువతకు జాబ్ లు  

కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​కు ఎస్టీపీపీలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గును సింగరేణి సంస్థకు చెందిన యూజీ, ఓసీపీ గనులు నుంచి తీసుకుంటారు. శ్రీరాంపూర్​ సీహెచ్​పీ  రైల్వే ట్రాక్​లైన్ ను వినియోగిస్తారు. ఏటా 4  మిలియన్​ టన్నుల బొగ్గు అవసరం. రెండు యూనిట్లకు  నీటిని సరఫరా చేసేందుకు షెట్​పల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచే  మూడో ప్లాంట్​కు అందిస్తారు. కొత్తగా  భూ సేకరణ అవసరం లేదు. ఎస్టీపీసీలోని127 హెక్టార్లను కేటాయిస్తారు. భవిష్యత్ లో మరో 800 మెగావాట్ల ప్లాంట్ ​ఏర్పాటుకు సింగరేణి ఆలోచన చేస్తోంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే  రాష్ట్ర అవసరాల్లో 25 శాతానికి పైగా  విద్యుత్ అవసరాలను తీర్చనుంది.

 ఇప్పటికే రెండు ప్లాంట్ల నుంచి సింగరేణికి ఏటా రూ.500 కోట్లకుపైగా లాభాలు వస్తుండగా, మూడో ప్లాంట్​ ద్వారా అదనంగా మరో రూ.500 కోట్లు ఆర్జించనుంది. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎస్టీపీపీలో 80 శాతం కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ జాబ్ లు స్థానికులకే ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మూడో యూనిట్​తో  సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.