
- తమకు ఆర్డర్స్ లేవంటున్న డీపీవోలు
- 1,190 కోట్లు రిలీజ్ చేశామని ఇటీవల మంత్రుల వెల్లడి
- 9 నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు కూడా ఇవ్వని సర్కార్
- బిల్లుల కోసం సర్పంచ్ల ఎదురుచూపులు
- దశాబ్ది ఉత్సావాల్లో వ్యతిరేకత రావొద్దనే ఫండ్స్ రిలీజ్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా క్షేత్ర స్థాయిలో ఫండ్స్ మాత్రం రిలీజ్ కాలేదు. బిల్లుల విడుదలపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) చెబుతున్నారు. సాధారణంగా డీపీవోలకు ఆదేశాలు వచ్చిన తర్వాత బిల్లులు ప్రాసెస్ చేయాలంటే వారం రోజుల టైమ్ పడుతుంది.
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఏడాదిగా బిల్స్ పెండింగ్‌లో పెట్టింది. ఒక్కో సర్పంచ్‌కు రూ.10 లక్షల పైనే బకాయి ఉంది. అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ పనులు చేయిస్తే ఏడాది నుంచి బిల్లులు ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు త్వరలోనే ఉండటం, ఇప్పుడు తమపై గ్రామాల్లో వ్యతిరేకత వస్తే రాజకీయ జీవితానికి ప్రమాదమంటున్నారు.
బిల్లుల రిలీజ్ ప్రాసెస్ ఇది
జీపీల బిల్లుల రిలీజ్‌కు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే డీపీవోలు మండల కార్యాలయాల్లో ఉండే ఆపరేటర్లకు గ్రామ పంచాయతీల వారీగా బకాయిల లిస్ట్ రెడీ చేసి పంపాలని ఆదేశిస్తారు. ఆ లిస్ట్ ను ప్రభుత్వానికి పంపితే నిధులు విడుదల చేస్తారు. అప్పుడు సబ్ ట్రెజరీ ఆఫీస్ నుంచి గ్రామ పంచాయతీ ఖాతాలకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఇంత వరకు తమకు బిల్లుల రిలీజ్‌పై ఎటువంటి ఆదేశాలు రాలేదని ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ డీపీవో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్నందున ఆర్డర్స్ వచ్చినా ప్రాసెస్పూర్తవడానికి పదిరోజుల కంటే ఎక్కువ టైమ్ పడుతుందని చెప్పారు.
ఎస్ఎఫ్సీ నిధులు కూడా ఆపేశారు
గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లకు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు ఇచ్చేది. పల్లె ప్రగతి టైమ్ లో నిధులు కరెక్ట్‌గా ఇచ్చి, ఆ తరువాత నిధులను విడుదల చేయటం లేదు. గత తొమ్మిది నెలలుగా ఈ నిధులు విడుదల చేయటం లేదని సర్పంచ్ లు చెబుతున్నారు. ఈ నిధులు వస్తే కార్మికుల జీతాలు, ట్రాక్టర్, ట్యాంకర్ ఈఎంఐ, కరెంట్ బిల్లులు వంటివి చెల్లించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
ఉత్సవాల కోసమే ప్రకటన..
ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో ఈ10 ఏండ్లలో జరిగిన అభివృద్ధిపై డాక్యుమెంటరీ రూపొందించి ప్రచారం చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఏడాది నుంచి బిల్లులు పెండింగ్ ఉండటంతో సర్పంచ్ లు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. మరో వైపు పేస్కేల్ ఇవ్వాలని వీఆర్ఏ లు ఆందోళన చేస్తున్నారు.
డీపీవోలు ఆర్డర్స్ రాలేదంటున్నరు
గ్రామ పంచాయితీలకు పెండింగ్ పెట్టిన బిల్లులు విడుదల చేస్తున్నమని నాలుగు రోజుల కింద మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. డీపీవోలను అడిగితే ఇంత వరకు సర్కార్‌నుంచి ఫండ్స్రిలీజ్పై ఎలాంటి ఆర్డర్లు రాలేదంటున్నరు. ఏడాది నుంచి మా జీపీకి రూ.15 లక్షలు బకాయి పెట్టిన్రు.
- ధనలక్ష్మి, సర్పంచ్, తాటికోల్, నల్గొండ
మేం బద్నామైతున్నం
ఏడాది నుంచి బిల్లులు ఇస్తలేరు. సొంత పైసలు ఖర్చు పెట్టినం.. అప్పులు తెచ్చి పనులు చేసినం.. వాటిపై వడ్డీ కోసం బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ ఏడాది లో ఎన్నికలు ఉన్నాయి. నిధులు పెండింగ్ లో ఉండటంతో పనులు జరగక గ్రామాల్లో పబ్లిక్ మాపై కోపంగా ఉన్నరు. ఎన్నికల ముందు ఇది మాకు ఇబ్బందికర పరిస్థితి.
- మహబూబ్‌నగర్‌కు చెందిన సర్పంచ్