పింఛన్  వాపసియ్యండి

పింఛన్  వాపసియ్యండి

    52,082 మందికి సంబంధించి రికవరీకి ఆదేశాలు

    ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువగా గుర్తింపు

    బ్యాంకులు, పోస్టాఫీసులకూ లెటర్లు

    రూ.50 కోట్లకుపైగా రికవరీ కావాలని అంచనా

చనిపోయిన ఆసరా పెన్షన్‌దారుల ఖాతాల్లో జమైన సొమ్మును అధికారులు రికవరీ చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు వారి కుటుంబాలకు నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఆసరా లబ్ధిదారుల్లో కొందరు మరణించినా.. వారి ఖాతాల్లో పెన్షన్​ సొమ్ము జమవుతూనే ఉంది. దీనిపై గతేడాది డిసెంబర్​లో సర్కారు స్పెషల్​ డ్రైవ్​ చేపట్టింది.  ఫీల్డ్‌ సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, మృతుల కుటుంబ సభ్యులు గుట్టుగా పెన్షన్​ సొమ్మును డ్రా చేసుకుంటున్నారని గుర్తించింది. రాష్ట్రంలో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, బీడీ వర్కర్స్‌, హెచ్‌ఐవీ, ఫైలేరియా పేషెంట్లు కలిపి మొత్తంగా 39,14,194 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో గ్రామాల్లోని 10,14,980 మంది లబ్ధిదారుల వివరాలను సిబ్బంది తనిఖీ చేసి.. 52,082 మంది చనిపోయినట్టు గుర్తించారు. కొందరికి మూడు నెలలుగా, మరికొందరికి అంతకంటే ఎక్కువ నెలల సొమ్ము ఖాతాల్లో జమైనట్టు తేల్చారు.

ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువగా..

ఆసరా పెన్షన్‌దారుల్లో నెలనెలా నాలుగు వేల నుంచి ఐదు వేల మరణాలు రిపోర్టు అవుతున్నాయి. ఇంకా గుర్తించని మరణాల సంఖ్య ఇంత భారీగా ఉండటం సెర్ప్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటివారి ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.50 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 3,506 మంది, సూర్యాపేట జిల్లాలో 2,780 మంది ఆసరా పెన్షన్‌దారులు చనిపోయినట్టు గుర్తించారు. నల్లగొండలో 2,454 మంది, రంగారెడ్డిలో 2,364 మంది, వరంగల్‌ రూరల్ జిల్లాలో 2,040 మంది, మహబూబాబాద్​లో 1,978 మంది మరణించినట్టు తేల్చారు. వారి అకౌంట్లలో నెలనెలా రూ.10 కోట్లకుపైగా జమ అవుతున్నట్టు గుర్తించారు. ఈ సొమ్ము రికవరీ కోసం ఇప్పటికే ఆయా బ్యాంకులు, పోస్టాఫీసులకు లేఖలు రాసిన అధికారులు జిల్లాల కలెక్టర్లకు కూడా సమాచారమిచ్చారు. డబ్బులు డ్రా చేసుకున్న కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద తహసీల్దార్ల ద్వారా నోటీసులు పంపిస్తున్నారు.