
ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవనం’ అని ఎన్నో తరాలు నమ్మిన నిజం, ఇప్పుడు నిరాధారమైపోయింది. 2004 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారంతా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి వచ్చారు. ఈ పథకం ఉద్యోగుల భవిష్యత్ భద్రతను హామీ ఇవ్వడం కంటే, మరింత అనిశ్చితి, ఆందోళన, ఆర్థిక భారం మోపుతున్నదనే వాస్తవం రోజురోజుకీ బహిర్గతమవుతోంది.
సీపీఎస్ ఉద్యోగి మరణించిన సందర్భంలో.. నిరుపేద కుటుంబంలో పుట్టి, చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఓ వ్యక్తి, తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆశ్రయమయ్యాడు. కానీ విధి వక్రతతో, కేవలం ఆరేళ్లకే ప్రమాదవశాత్తు మరణించాడు.
కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం రావడానికి ఏండ్ల తరబడి పడుతుండటమే కాకుండా, సీపీఎస్‌లో ఉండడం వల్ల ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే అప్పటివరకు ఉద్యోగి ప్రాన్ ఎకౌంటులో ఉన్న నగదు మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇది దారుణమైనది.
ఆ పరిస్థితిలో ఒకవేళ మరణించిన సీపీఎస్ఉద్యోగిపై ఆధారపడి భార్య,ఇద్దరు పిల్లలు, వృద్ద తల్లిదండ్రులు, పెళ్ళికాని వైకల్యం గల సోదరి/సోదరులు ఉంటే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి, ప్రాన్ ఎకౌంటులో ఉన్న నగదు మొత్తాన్ని కూడా కోల్పోవడంతో వస్తున్న ఆ ఒక్క అరకొర పెన్షన్ తో ఎవరికి న్యాయం చేయాలి? జన్మనిచ్చి,పెంచి పోషించి, పెద్దయ్యాక మాకు ఆసరా అవుతాడని కష్టపడి చదివించిన నిరుపేద వృద్ధాప్య తల్లిదండ్రులకు అవసాన దశలో ఆసరా పెన్షన్ కూడా అర్హతలేక ఇబ్బంది పడుతున్నారు.
ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బ్రతుకు ప్రశ్నార్థకంగా మారిన తల్లిదండ్రులకు న్యాయం చేయాలా లేక భర్తను కోల్పోయి తన పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిన భార్యకు న్యాయం చేయాలో అర్థంకాక ఆ కుటుంబాలు కలహాలతో చితికిపోతున్నాయి. ఒక వేళ సీపీఎస్ ఉద్యోగి,తన భార్య/భర్త కూడా మరణిస్తే, ఆ కుటుంబం కారుణ్య నియామకం పొందలేక ఉద్యోగి ప్రాన్ ఎకౌంటులో ఉన్న మొత్తాన్ని కూడా కోల్పోయి చాలీచాలని అరకొర ఫ్యామిలీ పెన్షన్తోఆ కుటుంబాలు వీధినపడుతున్నాయి.
సీపీఎస్ ఉద్యోగి పరిస్థితి దారుణం
రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే అతని ప్రాన్ ఎకౌంటులో ఉన్న 40 % నగదును కూడా నామినీకి ఇవ్వకుండా ఆ నామినీ చనిపోయిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వడం దారుణం. సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే.. కనీసం కట్టె ఖర్చులకు కూడా నోచుకోని సీపీఎస్ విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా పాత విధానంలోనే ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పోరాడుతున్నారు.
ఇలాంటి సందర్భాల్లో అంత్యక్రియల ఖర్చుకే ఆ ఉద్యోగి జమ చేసిన సొమ్ము సరిపోతుంది. అతని కుటుంబం నేటికీ జీవనోపాధి కోసం పోరాడుతోంది. ఈ ఉదాహరణ ఒక్కటే కాదు. తెలంగాణలోనే సుమారు కొన్ని వేల సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వాస్తవానికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలులో ఉంటే, కనీసం ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ , కమ్యుటేషన్ వంటి భరోసాలు అందేవి.
పెండింగ్‌లో మ్యాచింగ్ గ్రాంట్ రూ.7 వేల కోట్లు
జీఓ నెం. 250 ప్రకారం ప్రతి నెలా 10 వ తారీఖులోపు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కలపాలి కాని ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఆలస్యం చేస్తుండటంతో 2024 డిసెంబర్ నాటికి సుమారు ₹7 వేల కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్‌లో ఉంది. ఈ బకాయిల వలన చనిపోయిన, రిటైర్డ్ ఉద్యోగుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. సగటు సీపీఎస్ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ కేవలం రూ.5000 ల లోపే పరిమితం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు
మన దేశంలో మొదటి నుండి పశ్చిమ బెంగాల్ పాత పెన్షన్ విధానంలోనే కొనసాగుతుండగా, తమిళ నాడులో నేటికీ సి.పి.ఎస్ విధానాన్ని కొనసాగించడం లేదు, గత కాంగ్రెస్ పాలనా కాలంలో చత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి.
పంజాబ్, కర్ణాటక, రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఉద్యోగులు నిరసనలతో రోడ్లపైకి రావడంతో ఈ రాష్ట్రాలు ఓపీఎస్ ను పునరుద్ధరించాయి. ఇదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు మాత్రం సీపీఎస్ విధానాన్నే కొనసాగిస్తున్నాయి. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ అనే నినాదం అమలులో ఉన్న దేశంలో ఉద్యోగుల విషయంలో ‘ఒకే దేశం, వేర్వేరు పెన్షన్ విధానాలు’ ఉండటం విచారకరం.
కేంద్రం తెచ్చిన యూపీఎస్
ఉద్యోగుల ఆందోళనలను తగ్గించడానికి కేంద్రం ఇటీవల యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగి చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనం 50% పెన్షన్‌గా లభిస్తుంది. కనీసం 25 ఏళ్ల సేవ అవసరం. 10 ఏళ్ల సర్వీసు పూర్తిచేసినవారికి మాత్రమే కనీస అర్హత ఉంటుంది.
ఉద్యోగి 10% వాటాతో పాటు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించాలి. ఇప్పటికే మహారాష్ట్ర యూపీఎస్ అమలు చేయడానికి అంగీకరించింది. కానీ యూపీఎస్ వాస్తవానికి సీపీఎస్‌లోని లోపాలను దాచిపెట్టే ప్రయత్నమే తప్ప, ఉద్యోగుల సంక్షేమం కోసం సరైన పరిష్కారం కాదు.
తెలంగాణలో ఓపీఎస్ పునరుద్ధరించాలి
తెలంగాణలో సీపీఎస్ పెన్షన్ఉద్యోగులు ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టారు. కేంద్రం మెమోలు, గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా కొన్ని మార్పులు తీసుకువచ్చినా, వాటి అమలు రాష్ట్రాలపై ఆధారపడి ఉంది. తమిళనాడు ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించడానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలో ఓపీఎస్ పునరుద్ధరిస్తారని అంచనాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ల శ్రమతో ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుంది. అలాంటి ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత జీవనోపాధి కోసం ఆందోళన చెందడం ఒక పెద్ద అన్యాయం. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు – అది దానం కాదు, భిక్ష కాదు. కేంద్రం, రాష్ట్రాలు మానవీయ దృష్టితో ఆలోచించి, అందరు ప్రభుత్వ ఉద్యోగులకూ పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాలి. అదే నిజమైన న్యాయం.
సమస్యలు ఎన్నో..
ఓపీఎస్ కింద ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అతని చివరి బేసిక్ వేతనం 50% పెన్షన్‌గా జీవితాంతం లభిస్తుంది. అదనంగా డీఏ పెరుగుదల (డీఏ/డీఆర్ ) వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి చివరి నెల బేసిక్ వేతనం రూ.1 లక్ష అయితే, అతనికి నెలకు రూ.40–50 వేల మధ్య పెన్షన్‌తో పాటు డీఏ పెరుగుదల వర్తిస్తుంది. ఇది కేవలం ఉద్యోగికే కాకుండా, అతని భార్య/పిల్లలకు కూడా ఒక ఆర్థిక భరోసా.
సీపీఎస్‌లో ఉద్యోగి తన బేసిక్ వేతనం, డీఏలో 10% కాంట్రిబ్యూట్ చేస్తాడు. అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో చెల్లించాలి. ఈ మొత్తాన్ని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) నిర్వహిస్తుంది. షేర్ మార్కెట్ ఒడిదుడుకులపై పెన్షన్ ఆధారపడటం. ఒక ఉద్యోగి తన సర్వీసులో రూ.20 లక్షలు సేకరించాడనుకోండి. సీపీఎస్ నిబంధనల ప్రకారం, ఆ మొత్తంలో 40%ను యాన్యుటీల్లో పెట్టుబడి పెడతారు. దాని నుంచి వచ్చే రాబడి నెలకు కేవలం 5 వేల లోపు మాత్రమే. దీని మీద డీఏ/డీఆర్ వర్తించదు. ఇది పెరుగుతున్న ద్రవ్యోల్బణం ముందు ఏమాత్రం సరిపోదు.
-వి. లచ్చిరెడ్డి,చైర్మన్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ–