హాలిడే సీజన్​లో ప్రయాణాలకు రెడీ అవుతున్న జనం

హాలిడే సీజన్​లో ప్రయాణాలకు రెడీ అవుతున్న జనం

న్యూఢిల్లీ: ఈ హాలిడే సీజన్​లో ప్రయాణాలకు చాలా మంది రెడీ అవుతున్నారు. ఒక సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 75 శాతం మంది భారతీయులు త్వరలో కుటుంబం / స్నేహితులతోపాటు హాలిడేలకు వెళ్లాలని అనుకుంటున్నామని చెప్పారు. 82 శాతం మంది భారతీయ పెద్దలు,  83 శాతం భారతీయ జెన్‌‌జెడ్‌‌లు (1996– 2015 మధ్య పుట్టినవాళ్లు),  మిలీనియల్స్ (1981‌‌‌‌–1996 మధ్య పుట్టినవాళ్లు) కుటుంబ సభ్యులతో సెలవులను గడపాలని కోరుకుంటున్నారు. 67 శాతం మంది భారతీయ రెస్పాండెంట్లు ఈ సెలవు సీజన్‌‌లో  పరేడ్స్​, పండుగల వంటి కార్యక్రమాలకు హాజరు కావాలని అనుకుంటున్నారు. అమెరికన్ ఎక్స్‌‌ప్రెస్ తాజా ట్రెండ్ రిపోర్ట్ అమెక్స్ ట్రెండెక్స్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 

అమెరికన్ ఎక్స్‌‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్ ఇండియా సీఈఓ సంజయ్ ఖన్నా ఈ విషయమై మాట్లాడుతూ “ఈ సెలవు సీజన్‌‌లో భారతీయ వినియోగదారుల ఖర్చు విధానాల్లో  రెండు బలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకటోది.. వారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారు. రెండోది ఏమిటంటే, స్థానిక బ్రాండ్‌‌లు తయారుచేసే పర్యావరణ అనుకూల ప్రొడక్టులను కానుకలుగా ఇస్తున్నారు. తద్వారా చిన్న వ్యాపారవేత్తలు లేదా స్థానిక దుకాణ యజమానులకు సాయపడాలని కోరుకుంటున్నారు. అమెక్స్ ట్రెండెక్స్ రిపోర్టు ప్రకారం, సర్వేల్లో పాల్గొన్న రెస్పాండెంట్లలో చాలా మంది కనీసం ఒక ఈవెంట్‌‌లో అయినా పాల్గొనడం ద్వారా తమ సెలవులను ఎంజాయ్​ చేయాలని అనుకుంటున్నారు " అని వివరించారు. కస్టమర్లు, చిన్న వ్యాపారాలు, వాటి యజమానులు తమ ఖర్చులు, పొదుపు, ప్రయాణాల గురించి ఏమనుకుంటున్నారో అమెక్స్​ ట్రెండెక్స్ తెలియజేస్తుంది. ఇందుకోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, ఇండియా, కెనడా దేశాల్లో ఇది సర్వేలు చేస్తుంది.